శశికళ వ్యాపారానికి మరో ఐటీ దెబ్బ : పన్నీర్ ఘాటేనా?

Update: 2016-12-09 15:47 GMT

 

శశికళకు చెందిన సినీ ఫైనాన్స్ కంపెనీపై ఐటీదాడులు జరిగాయి

అలాగే జయలలిత తరవాత అన్నా డీఎంకే పార్టీలో ముఖ్యమంత్రి పదవి స్థాయి ఉన్న, ఆ పదవికి పోటీపడుతున్న నాయకుడిగా పేరున్న పళనిస్వామి ఇంటి మీద కూడా ఐటీ దాడులు జరిగాయి. పళనిస్వామి బంధువులు అందరి ఇళ్ల మీద కూడా దాడులు నిర్వహిస్తున్నారు. ఈ దాడుల్లో 12 కోట్ల రూపాయల విలువైన కొత్త 2000 నోట్లు స్వాధీనం చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే అన్నా డీఎంకే ఆర్థిక బలగంలో ఒకరైన కాంట్రాక్టరు శేఖర్ రెడ్డి, ఆయన మిత్రుల ఇళ్ల మీద నిన్నటినుంచి ఐటీ దాడులు జరుగుతున్న సంగతి తెలిసిందే. మొత్తానికి తమిళనాడు రాజకీయాల్లో ఐటీ ప్రకంపనలు ప్రతిధ్వనిస్తున్నాయి. శేఖర్ రెడ్డి మీద ఐటీ దాడులు జరిగినప్పుడే.. వీటి వెనుక సీఎం పన్నీర్ సెల్వం ప్రమేయం ఉన్నట్లుగా తెలుగుపోస్ట్ శుక్రవారం ఉదయం ఒక కథనాన్ని అందించింది. పన్నీర్ సెల్వం పాత్ర ఉన్నదనే అనుమానాలు మరింత బలపడేలా.. ఆయనకు పార్టీలో పోటీదారు అయిన పళనిస్వామి, శశికళ ల ఆస్తుల మీద ఐటీ దాడులు జరగడం గమనించాల్సిన అంశం.

పన్నీర్ సెల్వం ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా అన్నా డీఎంకే మీద తనదైన శైలిలో పట్టు బిగించడం కోసం శశికళ పావులు కదుపడం మొదలైంది. ఆమె తన ఇంటిలో కేబినెట్ మంత్రులందరినీ పిలిపించి మీటింగ్ పెట్టుకోవడం కూడా వివాదాస్పదం అయింది. ప్రస్తుత వాతావరణం సద్దుమణిగాక శశికళ సీఎం కుర్చీని తన పరం చేసుకునే ఆలోచనలో ఉన్నారనే వదంతులు వస్తున్నాయి.

ఈ నేపథ్యంలోనే విశ్వసనీయ సమాచారం మేరకు తెలుగుపోస్ట్ అందించిన విశ్లేషణ మరింత ఘాటుగా నిజంగా తేలుతోంది. పన్నీర్ సెల్వం ప్రమేయంతోనే అన్నా డీఎంకే కే చెందిన ఆయన వైరి వర్గాలు, వారి ఆర్థిక వనరుల మీద ఐటీ దాడులు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఏకంగా శశికళకు చెందిన ఫైనాన్స్ కంపెనీ మీదనే దాడులు జరిగాయంటే.. చిన్న విషయం కాదు. పన్నీర్ సెల్వంతో ముఖ్యమంత్రి స్థానానికి పోటీపడిన పళని స్వామికి ఐటీ అధికారులు చెక్ పెట్టడం జరిగింది. మొత్తానికి పన్నీర్ సెల్వం.. అమ్మ జీవించి ఉండగా.. ఎంత విధేయుడిగా ఉన్నాడో.. ఆమె మరణానంతరం.. అంత చాణక్యశైలిలో రాజకీయం నడిపిస్తున్నట్లు కనిపిస్తోంది.

Similar News