శశికళ చుట్టు ఉచ్చు బిగుసుకుందా?

Update: 2017-11-10 17:30 GMT

శశికళకు నిద్ర కరువైంది. రెండో రోజుకూడా ఆదాయపు పన్ను శాఖ అధికారులు దాడులు చేశారు. గురువారం మొదలయిన ఈ దాడులు రెండోరోజు కూడా కొనసాగుతుండంటంతో శశికళ వర్గంలో కలవరం మొదలయింది. పైకి తామేమీ భయపడబోమంటూ చెబుతున్నప్పటికీ దాడుల్లో బయటపడుతున్న పత్రాలతో శశికళవర్గం బెంబేలెత్తిపోతోంది. గురువారం జయలలిత కు చెందిన కొడనాడ్ ఎస్టేట్ లో కూడా దాడులు నిర్వహించారు. ఈ ఎస్టేట్ కూడా చిన్నమ్మ చేతుల్లోనే ఉంది. ఈ ఎస్టేట్ లో చోరీ జరిగిన సంగతి తెలిసిందే. వాచ్ మెన్ హత్యకు గురయ్యాడు. వాచ్ మెన్ హత్యకు కారణమైన మరో ఇద్దరు కూడా వేర్వేరు ప్రమాదాల్లో అనుమానాస్పదంగా మరణించారు. ఈనేపథ్యంలో కొడనాడ్ ఎస్టేట్ లో కూడా ఐటీ అధికారులు దాడులు చేయడంతో చిన్నమ్మ వర్గం కలత చెందుతోంది.

భారీగా పన్ను ఎగవేత....

శశికళ, ఆమె కుటుంబ సభ్యులకు చెందిన మొత్తం పది ఆస్తులకు సంబంధించి సోదాలు చేస్తున్నారు. తెలంగాణ, కర్ణాటక, తమిళనాడుల్లో కూడా ఈ దాడులు నిర్వహించారు. శశికళ, ఆమె కుటుంబసభ్యుల ఆస్తులకు సంబంధించి 187 ప్రాంతాల్లో సోదాలు జరుగుతున్నాయి. ఈ దాడుల్లో మొత్తం 2 వేల మంది అధికారులు, సిబ్బంది పాల్గొంటున్నారు. అయితే ఈ దాడులకు సంబంధించి పక్కా సమాచారం ఐటీ శాఖ అధికారుల వద్ద సమాచారం ఉండటంతో సులువుగా వెళ్లి పత్రాలను స్వాధీనం చేసుకుంటున్నారు. ముఖ్యంగా నోట్ల రద్దు తర్వాత డొల్ల కంపెనీలకు ఎక్కువ మొత్తం నగదు మారిందన్న అనుమానం ఉంది. అంతేకాకుండా ఆదాయం వస్తున్నప్పటికీ శశికళకు సంబంధించిన కంపెనీలు భారీగా పన్ను ఎగవేతకు పాల్పడినట్లు తెలియడంతో ఈ దాడులు జరుపుతున్నామని అధికారులు చెబుతున్నారు. అయితే ఇది రాజకీయ దాడిగా శశికళ వర్గం నేతలు ఆరోపిస్తున్నారు. దాడులతో తమను దెబ్బతీయలేరని, శశికళ కడిగిన ముత్యంలా జైలు నుంచి బయటకు వస్తారని శశికళ వర్గం నేతలు చెబుతున్నారు. మొత్తం మీద రెండో రోజు కూడా శశికళ, ఆమె బంధువులు, సన్నిహితుల నివాసలపై దాడులు కొనసాగడం చర్చనీయాంశంగా మారింది.

Similar News