శశికళ vs శశికళ

Update: 2016-12-28 10:18 GMT

అన్నా డీఎంకేలో ఇద్దరు శశికళల మధ్య విభేదాలు రోడ్డెక్కాయి. జయలలిత నెచ్చలి శశికళ, రాజ్యసభ సభ్యురాలు శశికళ పుష్పల మధ్య వైరం బుధవారం తారాస్థాయికి చేరుకుంది. జయలలిత మరణానికి శశిశలే కారణమంటూ పుష్ప గత కొన్ని రోజులుగా ఆరోపిస్తున్నారు. జయలలిత మరణంపై నిజానిజాలను వెలికితీయాలని పుష్ప మద్రాసు హైకోర్టులో పిటిషన్ కూడా వేశారు. బుధవారం ఆ పిటిషన్ విచారణకు రానుంది అయితే అన్నాడీఎంకే కార్యకర్తలు, శశికళ అనుచరులు పుష్ప న్యాయవాదిపై దాడి చేశారు. అన్నాడీఎంకే కార్యాలయం వద్దే ఈ సంఘటన జరిగింది. అన్నాడీఎంకే కార్యదర్శి పదవికి తాను పోటీ చేస్తున్నట్లు కూడా శశికళ పుష్ప ప్రకటించారు. తనను పార్టీ నుంచి బహిష్కరించలేదని, ప్రస్తుతం తాను అన్నాడీఎంకే ఎంపీగానే కొనసాగుతున్నానని చెప్పారు. పార్టీ ప్రాధమిక సభ్యత్వం ఉన్న ప్రతి ఒక్కరూ ప్రధాన కార్యదర్శి పదవికి పోటీ చేయవచ్చన్న పుష్ప పార్టీలో 75 శాతం మంది కార్యకర్తలు ప్రధాన కార్యదర్శి పదవికి చిన్నమ్మ పోటీ చేయడం ఇష్టపడటం లేదన్నారు. పుష్పకు జయలలితే రాజ్యసభ సభ్యత్వం ఇచ్చారు. అయితే అన్నాడీఎంకే నాయకత్వాన్ని థిక్కరిస్తూ ఆమె చేసిన వ్యాఖ్యలతో జయ ఆగ్రహించి పుష్పను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. తర్వాత పుష్ప మరిన్ని చిక్కుల్లోనూ పడ్డారు. డీఎంకే ఎంపీ తిరుచి శివపై పుష్ప చేయి చేసుకున్నారు. ఈ వివాదంలోనూ జయ ఆగ్రహానికి గురయ్యారు. తర్వాత శివకు పుష్ప క్షమాపణ చెప్పారు. తనను పోయెస్ గార్డెన్ లో కుక్కలా చూస్తున్నారని పుష్ప చేసిన ఆరోపణలతో ఆమె జయకు మరింత దూరమయ్యారు.తనపై ఎంపీ కుటుంబసభ్యులు లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారంటూ పుష్ప ఇంట్లో పనిమనిషి ఫిర్యాదుతో ఆమె ముందస్తు బెయిల్ కోసం అనేక సార్లు ప్రయత్నించారు. కోర్టులో నకిలీ పత్రాలు పెట్టారన్న ఆరోపణలు పుష్ప ఎదుర్కొన్నారు. శశికళ వల్లనే తాను పార్టీ నుంచి బహిష్కరణకు గురయ్యయాన్నది పుష్ప ఆరోపణ. ఈ నేపథ్యంలో శశికళ అనుచరులు పుష్ప న్యాయవాదిపై దాడి చేశారు. జయలలిత మరణానికి కారణం శశికళే నంటూ కోర్టు కెక్కుతావంటూ లాయర్ ను చితకబాదారు. రెండు రోజుల్లో అన్నాడీఎంకే పార్టీ సర్వ సభ్య సమావేశం ఉండగా ఈ సంఘటన చోటుచేసుకోవడం గమనార్హం.

Similar News