శత్రుకూటమి నేత అయినా సమర్థిస్తున్నారే!

Update: 2016-11-17 04:00 GMT

ఛాన్సు దొరికింది కదాని.. నోటు కష్టాలను వాడుకుంటూ.. మోదీ సర్కారును ప్రజాకంటక ప్రభుత్వంగా అభివర్ణిస్తూ బురద చల్లడానికి ఒకవైపు కొన్ని విపక్షాలు ఏకం అవుతున్నాయి. అదే సమయంలో.. మోదీని తొలినుంచి శత్రువుగా భావిస్తున్నప్పటికీ.. ఓ ముఖ్యమంత్రి మాత్రం.. పెద్దనోట్ల రద్దు విషయంలో ఆయన నిర్ణయానికి జై కొడుతున్నారు. ఆయన మరెవ్వరో కాదు.. అసలు ప్రధాని పదవిలో మోదీ ఉండడానికి వీల్లేదంటూ తొలినుంచి వ్యతిరేకిస్తున్న బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్.

ఎన్డీయే కూటమి సార్వత్రిక ఎన్నికల కంటె ముందు నరేంద్రమోదీని ప్రధాని అభ్యర్థిగా ప్రకటించడానికంటె ముందునుంచి ఆ ఆలోచనను బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ తీవ్రంగా వ్యతిరేకిస్తూ వచ్చారు. భాజపాతో మైత్రిని కూడా ఆయన కాలదన్నుకున్నారు. మోదీ ప్రధాని అయిన తర్వాత కూడా... నితీశ్ వైఖరిలో మార్పు మాత్రం రాలేదు. బీహార్ ను నితీశ్ పాలన నుంచి బయటకు తెచ్చి భాజపా జెండా ఎగరేయాలని సంకల్పించిన మోదీ.. బీహార్ కు ప్యాకేజీలు ప్రకటిస్తే వాటిని కూడా ఈసడించిన వ్యక్తి నితీశ్. గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉండగా, మోదీ వరదసాయం ప్రకటిస్తే తిప్పికొట్టిన వ్యక్తి నితీశ్. మోదీ పట్ల అంత వ్యతిరేకత ఉండే నేతే అయినప్పటికీ.. పెద్ద నోట్లు రద్దు నిర్ణయాన్ని మాత్రం ఆయన పూర్తిగా సమర్థిస్తున్నారు.

ఈ నిర్ణయంతో దేశంలోని నకిలీ నోట్లన్నీ మాయం అయిపోతాయంటూ నితీశ్ సమర్థిస్తున్నారు. పెద్దనోట్ల రద్దు నిర్ణయానికి తాను పూర్తి మద్దతు తెలియజేస్తున్నానంటూ ఆయన ప్రకటించడం విశేషం. బీహార్ లో పాలన సాగిస్తున్న తమ కూటమిలోని భాగస్వామి లాలూ ప్రసాద్ యాదవ్.. ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న, మోదీకి వ్యతిరేకంగా విపక్షాలను కూడగడుతున్న బృందంలో ఉన్నారు. అయితే.. తమ భాగస్వామి అభిప్రాయాలకు విరుద్ధంగా నితీశ్ మాత్రం దీనిని సమర్థించడమే విశేషమే. అదే సమయంలో.. దేశం బాగుపడాలంటే.. బినామీ పేర్లతో ఉండే ఆస్తుల మీద కూడా దాడులు నిర్వహించాల్సిందే అని నితీశ్ కుమార్ పిలుపు ఇస్తున్నారు. మోదీ ఎటూ నల్లధనం నియంత్రణ పై చిత్తశుద్ధితో పోరాడుతున్నట్లయితే.. ఇలాంటి అన్ని సూచనలనూ పరిగణనలోకి తీసుకుంటే బాగుంటుంది.

Similar News