వైసీపీకి పీకే తలనొప్పిగా తయారయ్యారా?

Update: 2017-11-06 12:30 GMT

వైసీపీ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ వైసీపీ నేతలకు తలనొప్పిగా తయారయ్యారా? తమను పీకే టీం ఇబ్బందులు పెడుతుందని ఫ్యాన్ గుర్తు లీడర్లు ఫీలయిపోతున్నారా? అవును.. వైసీపీ అధినేత జగన్ కు ఇడుపులపాయలో ఎక్కువ మంది ఇదేరకమైన ఫిర్యాదులు అందించినట్లు సమాచారం. జగన్ ఈరోజు పాదయాత్ర ప్రారంభించిన సంగతి తెలిసిందే. అయితే ఆయన ఆదివారం వైసీపీ ముఖ్యనేతలతో జరిపిన సమావేశంలో ప్రధానంగా ప్రశాంత్ కిషోర్ టీంపైనే ఎక్కువగా చర్చించినట్లు తెలిసింది. పాదయాత్ర జరుగుతున్న సమయంలో నియోజకవర్గాల్లో ఏ ఏ కార్యక్రమాలు చేపట్టాలో పీకే స్పష్టంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. దాని ప్రకారమే కార్యక్రమాలు కొనసాగాలన్నారు. అందుకు వైసీపీ నేతలు కూడా సిద్ధమయ్యారు.

పీకే టీం మీద ఫిర్యాదులు....

అయితే పీకే టీం నియోజకవర్గాల్లో జరుపుతున్న సర్వేలు తమకు ఇబ్బందులు తెచ్చిపెడుతున్నాయని కొందరు వైసీపీనేతలు నేరుగా జగన్ కు ఫిర్యాదుచేశారట. తాము పార్టీకోసం కష్టపడుతున్నా తమ గురించి వారు కార్యకర్తలనే ఆరా తీస్తుండటం తమకు చిన్నతనంగా ఉందని చెబుతున్నారు. అంతేకాకుండా పీకే టీం కేవలం కొందరినేకలుస్తూ... సర్వే చేయడాన్ని కూడా మరికొందరు ఈ సందర్భంగా తప్పుపట్టారని తెలిసింది. అలాగే ఒక సీనియర్ నేత మాత్రం ప్రజాసంకల్పయాత్ర పేరు పై కూడా అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. వైసీపీ ప్లీనరీలో ‘అన్న వస్తున్నాడు’ అనే నినాదం ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లామని, అయితే ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ ప్రజాసంకల్ప యాత్ర అని పేరు మార్చడాన్ని కూడా తప్పుపట్టినట్లు తెలిసింది. అయితే అన్నీ సావధానంగా విన్న జగన్ ఎవరి పని వారు చేసుకెళ్లమని, ఎవరూ పీకే టీం గురించి భయపడాల్సిన అవసరం లేదని, ఆలోచించాల్సిన అవసరం అంతకంటే లేదని స్పష్టం చెప్పారట. కొన్ని మంచి విషయాలను తాను తీసుకుంటానని, రాష్ట్రంలో ఎక్కడ ఏం జరుగుతుందో తనకు తెలుసునని జగన్ వారికి నచ్చజెప్పినట్లు తెలిసింది. మొత్తం మీద పీకే మీద ఎక్కువ మంది ఫిర్యాదులు చేయడం విశేషం.

Similar News