వైసీపీ లేకుండానే... చప్ప...చప్పగా..!

Update: 2017-11-10 02:30 GMT

నేటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. శాసనసభ ఈరోజు ఉదయం 9.45 గంటలకు ప్రారంభం కానుండగా, శాసనమండలి 10.30గంటలకు ప్రారంభమవుతుంది. చరిత్రలో తొలిసారిగా ప్రతిపక్షం లేకుండా ఏపీ శాసనసభ నేటి నుంచి జరగబోతోంది. పార్టీ మారిన 22 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసేంత వరకూ తాము శాసనసభకు రాబోమని ప్రతిపక్ష వైసీపీ ఇప్పటికే స్పష్టం చేసింది. తాజాగా కూడా మరో ఎమ్మెల్యే వంతల రాజేశ్వరిని పార్టీలోకి చేర్చుకోవడంపై వైసీపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. అయితే అనర్హత వేటు వివాదం కోర్టు పరిధిలో ఉన్నందున తాను నిర్ణయం తీసుకోలేని ఏపీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు స్పష్టం చేశారు. తాను నిర్ణయం తీసుకోకముందే వైసీపీ కోర్టుకు వెళ్లడంతో తాను దీనిపై ఎలా నిర్ణయం తీసుకుంటానని ప్రశ్నిస్తున్నారు. దీనికి వైసీపీ కూడా ధీటుగానే సమాధనమిచ్చింది. వైసీపీ ఎమ్మెల్యే రోజాపై ఏడాది పాటు సస్పెన్షన్ వేటు ఎలా వేశారని ప్రశ్నించింది. అంతేకాకుండా వైసీపీ టిక్కెట్ మీద గెలిచి మంత్రులుగా సభలో కూర్చున్నా స్పీకర్ చోద్యం చూస్తున్నారని ఎద్దేవా చేసింది. ఈ నేపథ్యంలో ప్రతిపక్షం లేకుండానే ఏపీ అసెంబ్లీ సమావేశాలు మరికాసేపట్లో ప్రారంభం కాబోతున్నాయి.

మొత్తం 28 అంశాలపై.....

ఏపీ అసెంబ్లీ సమావేశాలు పదిరోజుల పాటు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. దీనిపై బీఏసీ సమావేశంలో నిర్ణయిస్తారు. ఏపీ అసెంబ్లీ సమావేశాలు జీఎస్టీ బిల్లును ఆమోదించడం కోసం ఈ ఏడాది మే నెల 15వ తేదీన జరిగాయి. ఆ తర్వాత ఇదే జరగడం. సభలో ప్రజలకు సంబంధించిన అంశాలను ప్రస్తావించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు తన పార్టీ ఎమ్మెల్యేలకు సూచించారు. అలాగే ఎమ్మెల్యేలు లేవనెత్తిన ప్రశ్నలకు మంత్రులు విధిగా సమాధానం చెప్పాలని, అందుకు ప్రిపేర్ అయి ఉండాలని ఆదేశించారు. ప్రతిపక్షం లేదు కదా.. అని నిర్లక్ష్యంగా ఉండవద్దని హెచ్చరించారు. ఈ సమావేశంలో ప్రభుత్వం నాలుగు బిల్లులు ప్రవేశపెట్టే అవకాశముంది. యూనివర్సిటీల్లో ఉద్యోగ నియామకాలను ఏపీపీఎస్సీకి అప్పగించే అంశం, భూసేకరణ చట్ట సవరణ, నాలా బిల్లులు ప్రవేశపెట్టనుంది. దీంతో పాటు 28 అంశాలపై ప్రభుత్వం చర్చించనుంది. పోలవరం ప్రాజెక్టు, రియల్ టైమ్ గవర్నెన్స్, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, పెళ్లి కానుక పథకం, విద్యార్థుల ఆత్మహత్యలు, రాజధాని పురోగతి వంటి అంశాలపై చర్చ జరుగుతుంది. అధికార పార్టీకి చెందిన సభ్యులు ఎవరూ గైర్హాజరు కాకూడదని చంద్రబాబు ఇప్పటికే ఎమ్మెల్యేలను ఆదేశించారు.

Similar News