వైఫల్యం ఎక్కడున్నదో తేల్చిచెప్పిన కేసీఆర్‌ మాటలు!

Update: 2016-09-24 23:07 GMT

కాసింత వర్షం పడగానే భాగ్యనగరంలోని జనజీవితం నానా పాట్లకు గురికావడం పట్ల నాయకులు ఎవరికి తోచిన విధంగా వారు మాట్లాడారు. ఒకవైపు ప్రభుత్వ వైఫల్యం అంటూ విపక్ష్యాలు క్యాష్‌ చేసుకునే ప్రయత్నం చేస్తే, గత పదేళ్లుగా కాంగ్రెస్‌ పాలకుల పాపమే ఇవాళ ఇలా ప్రతిబింబిస్తున్నదంటూ తెరాస నాయకులు కౌంటర్లు ఇచ్చారు. ఇదంతా బాగానే ఉంది. సహాయక చర్యల కంటె పరస్పర నిందారోపణలు బాగా వినిపించాయి.

అయితే తాజాగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్వయంగా వెల్లడిస్తున్న మాటల్లో అసలు పాపం ఎక్కడున్నదో తేలిపోతోంది. ఎవ్వరి బాధ్యతారాహిత్యం ఉన్నదో, ఎవరి అచేతనత్వం, లేదా మరెవ్వరి పట్టించుకోని వైఖరి కారణంగా.. ఇలాంటి విపత్కర పరిస్థితి ఎదురైందో తేలిపోతోంది.

కేసీఆర్‌ వరద పరిస్థితుల్ని మంత్రులు, ఉన్నతాధికార్లతో కలిసి సమీక్షిస్తూ.. నగరంలోని నాలాలపై ఉన్న అక్రమ కట్టడాలు అన్నిటినీ కూలగొట్టేస్తాం అంటూ చాలా డాంబికంగా ప్రకటించారు. అవి నగర జీవన శైలికి ఎంత ప్రమాదకరంగా మారాయో కూడా ప్రకటించారు. నగరంలో 390 కిమీల పొడవైన నాలాలుంటే.. 173 కిమీలు పూర్తిగా ఆక్రమణలకు గురయ్యాయని చెప్పారు. నాలాల మీద 28వేల అక్రమ కట్టడాలు ఉన్నాయని సెలవిచ్చారు. వర్షాలు తగ్గగానే వీటిని కూల్చేస్తామని చెప్పుకొచ్చారు.

అయితే నాలాలపై అక్రమ నిర్మాణాలు ఉన్నాయంటే ఆ పాపం ఎవరి ఖాతాలోకి పోతుంది? ఏవో కొన్ని లేఅవుట్లలో అక్రమనిర్మాణాలంటే.. కొన్ని ప్రభుత్వాలకు ముడిపెట్టవచ్చు గానీ.. నాలాల మీద అక్రమ నిర్మాణాలుంటే.. కనీసం గత రెండేళ్లలో ఈ ప్రభుత్వం ఏం చేస్తున్నది. కనీసం వాటిని పరిశీలించిన పాపాన పోయిందా? తెరాస పాలనలోకి వచ్చిన రెండున్నరేళ్లలో నాలాల మీద అక్రమ నిర్మాణాలకు ఎన్నిసార్లు నోటీసులు ఇచ్చారు. వాటిని కూల్చేందుకు ఎలాంటి ప్రయత్నాలు జరిగాయి? ఇవన్నీ కేసీఆర్‌ సర్కారు చిత్తశుద్ధి మీద సందేహాలు రేకెత్తించే ప్రశ్నలే.

అలాగే.. నాలాలమీద ఉండే అక్రమ నిర్మాణాలకు అండగా లోకల్‌గా దందాలు చేస్తుండే స్థానిక నాయకుల మద్దతు పుష్కలంగా ఉంటుందన్నది అందరికీ తెలిసిన సంగతే. మరి వారినుంచి వచ్చే రాజకీయ ఒత్తిళ్లను తట్టుకుని పక్కాగా చేయడానికి ప్రభుత్వం సిద్ధంగానే ఉందా? ఆ నమ్మకాన్ని కేసీఆర్‌ తన చేతల ద్వారా ప్రజల్లో పాదుగొల్పగలరా? అనేది వేచిచూడాలి.

Similar News