వీరి పగలు, ప్రతీకారం ఇంకెన్నాళ్లు?

Update: 2017-11-11 10:30 GMT

అద్దంకిలో కరణం బలరామ్, గొట్టిపాటి వర్గాల మధ్య ఘర్షణలు ఆగేటట్లు కన్పించడం లేదు. ఇటీవల టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ అద్దంకి పర్యటనలో రెండు వర్గాలు కలిసి పనిచేస్తాయన్న సంకేతాలు కన్పించినప్పటికీ అది ఆశేనని మరోసారి రుజువైంది. అద్దంకి నియోజకవర్గంలో పట్టుకోసం రెండు వర్గాలూ గట్టిగానే ప్రయత్నిస్తుంటాయి. ముఖ్యంగా ఎమ్మెల్యే గొట్టిపాటి రవిని దెబ్బతీసేందుకు కరణం వర్గీయులు, కరణం వర్గాన్ని అణిచేసేందుకు గొట్టిపాటి వర్గీయులు నిరంతరం ప్రయత్నిస్తూనే ఉంటారు. అయితే కొంతకాలం క్రితం వీరిమధ్య ఉన్న అసందిగ్దతను తొలగించడానికి అద్దంకి నియోజకవర్గ బాధ్యతలను పూర్తిగా ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ కే అప్పగించారు. ఆయన వైసీపీ నుంచి గెలిచి టీడీపీలో చేరిన ఎమ్మెల్యే కావడంతో ఆయనకు ప్రయారిటీ ఇవ్వాలన్నది చంద్రబాబు ఆలోచన. లోకేష్ కూడా గొట్టిపాటి రవికుమార్ కే మద్దతు తెలుపుతున్నారు.

రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించి....

ఈ నేపథ్యంలో కొద్ది నెలల క్రితం గొట్టిపాటి వర్గీయులు కరణం వర్గానికి చెందిన ఇద్దరిని వేమవరంలో హత్య చేసిన సంగతి తెలిసిందే. ఈ జంట హత్యల కేసులో గొట్టిపాటి రవికుమార్ ప్రధాన నిందితుడని కరణం బలంగా ఆరోపించారు. ఈ కేసులో పదిహేను మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే తాజాగా రెండు రోజుల క్రితం ఈ జంట హత్యల కేసులో నిందితులు ప్రయాణిస్తున్న వాహనం ప్రమాదానికి గురైంది. ఈ జంట హత్యల కేసుల్లో నిందితులు 9 మంది గుంటూరు నుంచి కారులో అద్దంకి కోర్టులో హాజరయ్యేందుకు వస్తుండగా వేగంగా వస్తున్న టిప్పర్ ఢీకొట్టింది. ఈ ఘటనలో 9 మంది నిందితులు తీవ్రంగా గాయపడ్డారు. అయితే పోలీసులు జరిపిన విచారణలో ఇది రోడ్డు ప్రమాదం కాదని, గొట్టిపాటి వర్గీయులు ప్రయాణిస్తున్న వాహనాన్ని టిప్పర్ తో ఢికొట్టడానికేనని తేలింది. ఇది కరణం వర్గీయులపనేనని అంటున్నారు. ఈ టిప్పర్ ను వేమవరం గ్రామానికి చెందిన కరణం వర్గీయులు కొనుగోలు చేసినట్లు గుర్తించారు. మొత్తం మీద కరణం, గొట్టిపాటి పగలు చల్లారేటట్లు లేదు.

Similar News