విద్యుత్తు ఛార్జీల బాదుడుకు విరామం

Update: 2017-03-06 04:09 GMT

తెలంగాణ డిస్కంలు విద్యుత్తు ఛార్జీలను పెంచకుండా నానుస్తూ ఉందని విద్యుత్తు కంట్రోల్ బోర్డు చెబుతోంది. మీరు ప్రతిపాదనలు ఇవ్వకపోతే తామే విద్యత్తు ఛార్జీలను పెంచుతామంటూ హెచ్చరించింది. అయితే విద్యుత్తు ఛార్జీలను పెంచే అధికారం ఎలక్ట్రిసిటీ కంట్రోల్ బోర్డుకు లేదంటూ డిస్కంలు వాదిస్తున్నాయి. దీంతో రెండు విభాగాల మధ్య యుద్ధం నడుస్తోంది. ప్రతిపాదనలను ఇవ్వడం కావాలనే డిస్కం ఆలస్యం చేస్తున్నదని విద్యుత్తు నియంత్రణ మండలి చెబుతోంది. ఇష్టం వచ్చినప్పుడు విద్యుత్తు ఛార్జీలు పెంచుతామంటే కుదరదని కూడా మండలి స్పష్టం చేసింది.

ప్రజాభిప్రాయ సేకరణ తర్వాతే...

సాధారణంగా డిస్కంలు తమ నష్టాలను భర్తీ చేసుకునేందుకు విద్యత్తు ఛార్జీలను పెంచుతాయి. అయితే విద్యుత్ ఛార్జీలను పెంచేందుకు ఒక విధానాన్ని కొన్నేళ్లుగా అవలంబిస్తున్నారు. ముందుగా డిస్కంలు తమ ప్రతిపాదనలను సిద్ధం చేసుకోవాలి. ఎంత మేర విద్యుత్తు ఛార్జీలు పెంచాచాలకుంటున్నదీ విద్యుత్తు నియంత్రణ మండిలికి నివేదిక ఇవ్వాలి. దీని ఆధారంగా విద్యుత్తు నియంత్రన మండలి ప్రజాభిప్రాయాన్ని సేకరిస్తుంది. ప్రజాభిప్రాయాన్ని సేకరించిన తర్వాత ప్రభుత్వానికి నివేదిస్తుంది. తర్వాత విద్యుత్తు ఛార్జీలను పెంచుతారు.

ప్రభుత్వం వెనకడుగు వేస్తుందా?

అయితే రానున్న ఏడాదిలో తెలంగాణ డిస్కంలకు 9,824 కోట్ల నష్టం వచ్చే అవకాశం ఉన్నట్లు అంచాన వేసింది. ఇందులో రెండు వేల కోట్ల రూపాయలను ఛార్జీల పెంపు ద్వారా వినియోగదారుల నుంచి రాబట్టాలని, మిగిలిన 7,824కోట్లు ప్రభుత్వం సబ్సడి రూపంలో భరించాలని డిస్కం ప్రతిపాదనను రూపొందించి ప్రభుత్వానికి పంపింది. అయితే డిస్కంలు పంపిన ప్రతిపాదనకు ప్రభుత్వం నుంచి ఆమోదం లభించకపోవడంతో ఈఆర్సీకి నివేదిక పంపడంలో ఆలస్యమైంది. అయితే రెండు వేల కోట్ల రూపాయల భారాన్ని ప్రజలపై మోపడం ఇష్టం లేని ప్రభుత్వం వేచి చూసే ధోరణిని అవలంబిస్తోంది. డిస్కంల ప్రతిపాదన ప్రకారం పదిశాతం విద్యుత్తు ఛార్జీలను తెలంగాణలో పెంచాల్సి ఉంటుంది. ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో ప్రభుత్వం దీనిపై కూలంషకంగా చర్చించిన తర్వాతనే నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిసింది. గత ఏడాది నవంబరు నెలలోనే నివేదికను ఈఆర్సీకి సమర్పించాల్సి ఉండగా ఇంతవరకూ రాకపోవడానికి కారణం సర్కారు వైఖరేనన్నది సుస్పష్టం. దీంతో ఈఆర్సీ మాత్రం తాము ఎన్ని సార్లు లేఖలు రాసినా ప్రతిపాదనలు పంపడంలేదని, తామే విద్యుత్తు ఛార్జీలు పెంచుతామంటోంది. ఇది కుదరదంటోంది డిస్కం. ఈఆర్సీకి అటువంటి అధికారమే లేదంటోంది. ప్రతిపాదన అందిన తర్వాత 45 రోజుల పాటు ప్రజాభిప్రాయాన్ని సేకరించాలి. తర్వాత విద్యుత్తు ఛార్జీలను పెంచాల్సి ఉంటుంది. మొత్తం మీద ఈ ఏడాది తెలంగాణలో విద్యుత్తు ఛార్జీల ప్రతిపాదన లేనట్లేనన్నది నిపుణుల అభిప్రాయం.

Similar News