విజృంభిస్తున్న ముఠాలు : నల్లడబ్బే కదా.. దోచేద్దాం!

Update: 2016-11-18 05:45 GMT

దొంగతనమో దోపిడీనో జరిగితే వెళ్లి పోలీసులకు మొరపెట్టుకుంటాం. మన వద్ద ఉన్నదే దొంగడబ్బు అయితే.. ఇక చేసేదేముంటుంది! తేలుకుట్టిన దొంగలాగా కిక్కురు మనకుండా ఊరకుండిపోవాల్సిందే. ఇలాంటి పరిస్థితినే నేరపూరిత ఆలోచనలు ఉండే పలువురు ఈ సమయంలో సొమ్ము చేసుకుంటున్నారు. తమ వద్ద నల్లడబ్బు భారీ నిల్వలు ఉండి, దాన్ని వైట్ గా మార్చుకోవడానికి ప్రయత్నిస్తున్న పలువురిని తేలికగా బురిడీ కొట్టిస్తున్నారు. ఎడా పెడా దోచుకుంటున్నారు. కాకపోతే... కొన్ని కేసులు మాత్రం పోలీసుల వరకు వస్తున్నాయి. చాలా కేసులు.. అసలే దొంగ డబ్బు కావడంతో.. గుట్టుచప్పుడు కాకుండా ఉండిపోతున్నాయి.

హైదరాబాదులో ఇలాంటి అనేక సంఘటనలు వెలుగుచూస్తుండడం గమనార్హం. రాజేంద్రనగర్ లో నల్లడబ్బుకు కొత్తనోట్లుగా మార్చి ఇస్తాం అనే హామీతో ఇద్దరు యువకులు ఓ వ్యక్తి నుంచి 50 లక్షల రూపాయలు తీసుకుని పరారైన వైనం పోలీసుల దృష్టికి వచ్చింది. కంప్లయింటు చేసిన వ్యక్తి వివరాలు బయటపెట్టకుండా, అతడి ఐడెంటిటీని కాపాడిన పోలీసులు సత్వరమే స్పందించి.. కొన్ని గంటల వ్యవధిలోనే ఇద్దరు యువకులను అరెస్టు చేశారు. ఇది జరిగి ఒక్కరోజు కూడా కాకముందే నగరంలో మరొకరు మోసపోయారు. నల్లడబ్బును మార్చుకోవడానికి ఓ వ్యక్తి ప్రయత్నాల్లో ఉన్నాడని తెలుసుకున్న వాళ్లు, కమిషన్ తీసుకుని వెంటనే వైట్ మనీ ఇచ్చేస్తాం అంటూ అతని నుంచి సినీ ఫక్కీలో మూడు లక్షల రూపాయలు తీసుకుని పరారయ్యారు. వీరిని కూడా ఓయూ పోలీసులు వెంటనే అరెస్టు చేశారు.

అయితే ఇలా నల్లడబ్బు మార్చుకునే ఆత్రుతలో మోసపోతున్న వారి సంఖ్య ఇంకా చాలా ఎక్కువగానే ఉన్నదని.. వారెవ్వరూ పోలీసులను ఆశ్రయించలేని పరిస్థితిలో సతమతం అవుతున్నారని తెలుస్తోంది. అకౌంట్లలో చూపించకుండా తమ వద్ద పెద్ద మొత్తాల్లో డబ్బు కలిగి ఉన్న వాళ్లు తమ కుటుంబ సభ్యులు, తమకు మిత్రులు వంటి వారి అకౌంట్లలో 2.5 లక్షల వంతున డిపాజిట్ చేసుకుంటే వారికి ఇబ్బందులు ఉండవని టీవీ ఛానెళ్ల డిస్కషన్లలో ఆర్థిక నిపుణులు సలహాలు ఇస్తున్నారు. అయితే కొత్త వ్యక్తులతో ఇలాంటి డీల్ చేస్తున్న వాళ్లు ఇబ్బందులు పడుతున్నారని తెలుస్తోంది. వాళ్లు మారుస్తున్నది నల్లడబ్బే కదా.. అడ్డగోలుగో దోచేసుకున్నా ఎవరికీ చెప్పుకోలేరులే అనే ఆలోచనే చాలా మంది ఇలాంటి ముఠాలు విజృంభించేలా చేస్తోంది.

Similar News