విజయశాంతి ఉత్తమ్ కు ఎసరు పెట్టారే?

Update: 2017-11-11 01:30 GMT

విజయశాంతికి ఏఐసీసీలో పదవి ఇస్తుండటాన్ని ఆ పార్టీ నేతలు తప్పుపడుతున్నారు. విజయశాంతికి రాహుల్ గాంధీ వద్దకు తీసుకెళ్లి అంత ప్రాధాన్యం ఇవ్వడాన్ని కూడా జీర్ణించుకోలేని నేతలు సీఎల్పీనేత జానారెడ్డి వద్ద బరెస్ట్ అయ్యారు. రేవంత్ రెడ్డి చేరికనే హడావిడి చేయడం... నిన్నగాక మొన్న వచ్చిన నేతలకు ఇచ్చిన ప్రాధాన్యత కొన్నేళ్ల నుంచి పార్టీ కండువాను కప్పుకుని ఉన్న తమకు ఇవ్వకపోవడాన్ని కాంగ్రెస్ నేతలు బహిరంగంగానే తప్పుపడుతున్నారు. రేవంత్ విషయం కొంత పక్కన పెడితే విజయశాంతి వల్ల ఏం ఉపయోగముంటుందని ప్రశ్నిస్తున్నారు. రాహుల్ గాంధీ వద్ద విజయశాంతి గురించి గొప్పగా చెప్పిన పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డిపై కారాలు మిరియాలు నూరుతున్నారు. నిన్నటిదాకా కనుచూపు మేరలో కన్పించని విజయశాంతిని నెత్తికెక్చించుకోవడాన్ని కొందరు నేతలు జానారెడ్డి ఛాంబర్లోనే నిలదీశారు.

జానా ఛాంబర్లో ఉత్తమ్ పై మండిపడిన....

గతంలో తన ఓటమికి మాజీ మెదక్ ఎమ్మెల్యే శశిధర్ రెడ్డి కారణమంటూ విజయశాంతి హైకమాండ్ కు ఫిర్యాదు చేసింది. అయితే విజయశాంతి ఫిర్యాదును హైకమాండ్ పెద్దగా పట్టించుకోలేదు. అలాంటి విజయశాంతికి ప్రచార కమిటీలో ఎలా భాగస్వామ్యం కల్పిస్తారని ఏకంగా జానారెడ్డినే కొందరు నేతలు నిలదీశారు. సినీ గ్లామర్ వల్ల పార్టీ గట్టెక్కుతుందనుకోవడం అపోహ మాత్రమేనని హైకమాండ్ కు తెలియదా అని అంటున్నారు. జానా రెడ్డి ఛాంబర్లోనే విజయశాంతి పై పెద్దయెత్తున చర్చ జరిగింది. పార్టీని నమ్ముకుని పనిచేస్తున్న తమను ఏరోజూ రాహుల్ గాంధీని కలిసేందుకు అవకాశమివ్వలేదని, కాని మూడున్నరేళ్లు పార్టీకి దూరంగా ఉన్న విజయశాంతిని వెంటబెట్టుకుని ఉత్తమ్ ఎలా వెళ్లారని ఎమ్మెల్యేలు కొందరు ఘాటుగానే ప్రశ్నించారు. దీనిపై జానారెడ్డి కూడా తీవ్రంగానే స్పందించినట్లు తెలుస్తోంది. అయితే జానారెడ్డి సీనియర్ నేతలను సముదాయించారు. తాను విజయశాంతిని తీసుకెళ్లవద్దని ఉత్తమ్ తో చెప్పానని, అయినా తన మాట వినకుండా తీసుకెళ్లారని జానారెడ్డి నేతల ముందు వాపోయారట. దీనిపై ఉత్తమ్ ను పిలిచి జానారెడ్డి ఈ విషయాన్ని అడిగారు. అయితే తాను పార్టీకి సేవలందిస్తానని చెబితేనే రాహుల్ వద్దకు తీసుకెళ్లాలని ఉత్తమ్ వివరణ ఇచ్చినా జానారెడ్డి, భట్టి విక్రమార్కలు మాత్రం సంతృప్తి చెందలేదు. ఇకపై ఇలాంటివి జరగకుండా చూసుకుంటానని సీరియస్ అయిన సీనియర్ నేతలతో ఉత్తమ్ చెప్పినట్లు తెలిసింది. మొత్తం మీద రాములమ్మ రీ ఎంట్రీ కాంగ్రెస్ పార్టీ సీనియర్లలో మంటలు పుట్టిస్తోంది.

Similar News