విండీస్ ను రెండు రోజుల ముందే .....?

Update: 2018-10-15 01:48 GMT

విరాట్ సేన విజృంభణ ముందు రెండో టెస్ట్ రెండో ఇన్నింగ్స్ లో వెస్టిండీస్ చాప చుట్టేసింది. తొలి ఇన్నింగ్స్ లో చేసిన పోరాటం కూడా బ్యాటింగ్ కి పనికివస్తున్న పిచ్ పై విండీస్ బ్యాట్స్ మెన్ నిలవలేక భారత బౌలర్ల ధాటికి చేతులు ఎత్తేసి 10 వికెట్ల విజయాన్ని అర్పించుకున్నారు. భాగ్య నగర్ ఉప్పల్ లో జరిగిన సిరీస్ చివరి టెస్ట్ ఆసక్తికరంగా మారుతుందని విండీస్ తొలి ఇన్నింగ్స్ చూసిన వారంతా భావించారు. అయితే ఉమేష్ యాదవ్, రవీంద్ర జడేజా, అశ్విన్ బృందం ప్రత్యర్థులకు తొలి ఇన్నింగ్స్ లో ఇచ్చిన అవకాశం ఇవ్వలేదు. విండీస్ బ్యాటింగ్ ఇలా స్టార్ట్ అయ్యిందో లేదో ఓపెనర్లు డకౌట్ గా వెనుతిరగడంతో మ్యాచ్ భారత పక్షమే అని ముందే అభిమానులకు తెలిసి పోయింది.

సెంచరీలు చేజార్చుకున్న పంత్, రహానే.....

ఆరు వికెట్లు కోల్పోయి రెండవరోజు బ్యాటింగ్ ప్రారంభించిన భారత్ సెంచరీలు సాధిస్తారనుకున్న రిషబ్ పంత్, రహానే లను విండీస్ పెవిలియన్ దారి పట్టించింది. ఆ తరువాత జడేజా నిలదొక్కుకోలేక పోయినా అశ్విన్ ధాటిగా ఆడటంతో తొలి ఇన్నింగ్స్ ను ప్రత్యర్థులకన్నా 56 పరుగుల ఆధిక్యంలో ఆలౌట్ అయ్యింది టీం ఇండియా. తరువాత బ్యాటింగ్ మొదలు పెట్టిన విండీస్ వీరులు ఉమేష్ ధాటికి పరుగులేమి చేయకుండానే వెనుతిరిగారు.

భారత్ బౌలర్ల ధాటికి.....

తొలి ఇన్నింగ్స్ లో సెంచరీ సాధించిన ఛేజ్ ను ఆరు పరుగులకే ఇంటిదారి పట్టించాడు ఉమేష్ .అక్కడి నుంచి క్రమం తప్పకుండా భారత బౌలర్లు వికెట్లు సాధించడంతో విండీస్ 127 పరుగుల అత్యల్ప స్కోర్ కె ఆలౌట్ అయ్యింది. ఆ తరువాత స్వల్ప లక్ష్య ఛేదనలో టీం ఇండియా బ్యాట్స్ మెన్ ఏ మాత్రం చెక్కుచెదరకుండా కె ఎల్ రాహుల్ పృద్వి షా 72 పరుగులను వికెట్ నష్టపోకుండా చేసి పదివికెట్ల గ్రాండ్ విక్టరీని అందించారు. రెండు టెస్ట్ ల సిరీస్ ను 2-0 తేడాతో గెలిచిన టీం ఇండియా సంబరాలు వెంటనే ఉప్పల్ స్టేడియం లో మిన్నంటాయి. ఐదు రోజుల మ్యాచ్ మూడు రోజుల్లోనే ముగిసిపోయింది.

Similar News