రోజాపై వేటు తప్పదా...?

Update: 2017-03-08 00:30 GMT

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో రోజా హాట్ టాపిక్ గా మారింది. అధికార పక్షం ఇస్తున్న లీకులతో రోజాపై ఏడాది పాటు సస్పెన్షన్ వేటు తప్పదని అర్ధమవుతోంది. మరోవైపు ప్రతిపక్షం మాత్రం ఏడాది పాటు రోజాను ఇప్పటికే సస్పెండ్ చేశారని, ఎన్ని రోజులు రోజాను సస్పెండ్ చేసుకుంటూ వెళతారని ప్రశ్నిస్తోంది. అయితే ప్రివిలేజ్ కమిటీ ఇప్పటికే రోజాపై నివేదికను సిద్ధం చేసి స్పీకర్ కు ఇచ్చింది. స్పీకర్ ఏ నిర్ణయం తీసుకుంటారోనన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొని ఉంది. ఈ నెల 13 వతేదీన ఆర్థిక మంత్రి యనమల రాష్ట్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. ఇదే రోజు సభలో ఈ అంశం చర్చకు వచ్చే అవకాశముందా లేదా? అన్నది తెలియరాలేదు.

అధికార పార్టీ లీకులు....

రోజాను మరో ఏడాది పాటు సస్పెండ్ చేయాలని అధికార పార్టీ ఎమ్మెల్యే అనిత డిమాండ్ చేస్తున్నారు. దీనికి తోడు శాసనసభ వ్యవహారాల మంత్రి యనమల రామకృష్ణుడు మీడియాతో రోజా విషయంపై ఆఫ్ ది రికార్డ్ మాట్లాడారు. రోజా సభకు క్షమాపణ చెప్పాల్సిందేనన్నారు. ఎలాంటి షరతులు లేకుండా రోజా క్షమాపణ చెబితే అప్పడు సస్పెన్షన్ విషయాన్ని ఆలోచిస్తామన్నారు. అయినా రోజా సస్పెన్షన్ విషయంపై స్పీకర్ నిర్ణయం తీసుకుంటారని యనమల అన్నారు. అధికార పార్టీ నేతలు మాత్రం లీకులు వదులుతున్నారు. రోజాను మరో ఏడాది పాటు సస్పెండ్ చేసి తీరుతామంటున్నారు. చంద్రబాబును దూషించిన వ్యవహారంలో గతంలో ఏడాది పాటు శాసనసభ నుంచి రోజాను సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు అధికార పార్టీ ఎమ్మెల్యే అనిత తనను రోజా దూషించారంటూ ప్రివిలేజ్ కమిటీకి ఫిర్యాదు చేశారు. దీనిపై విచారించిన ప్రివిలేజ్ కమిటీ నివేదికను సిద్ధం చేసింది. అధికార పార్టీ ఇస్తున్న లీకులను బట్టి మరో ఏడాది పాటు రోజాను సస్పెండ్ చేస్తారని తెలుస్తోంది.

క్షమాపణ చెప్పేది లేదన్న రోజా...

వైసీపీ నేతలు మాత్రం మరో ఏడాది పాటు రోజాను ఎలా సస్పెండ్ చేస్తారని ప్రశ్నిస్తున్నారు. రోజా కూడా మీడియాతో మాట్లాడారు. స్పీకర్ కు తెలియకుండా అసెంబ్లీ వీడియో ఫుటేజ్ అసలు బయటకు ఎలా వచ్చిందని ఆమె ప్రశ్నిస్తున్నారు. కేవలం తాను అన్నమాటలనే ఎడిట్ చేసి మరీ బయటపెట్టారని రోజా ఆరోపిస్తున్నారు. తాను క్షమాపణ చెప్పే ప్రసక్తే లేదన్నారు రోజా. మహిళ ఆత్మగౌరవం కోసం మరో ఏడాది సస్పెండ్ అవ్వటానికి తాను సిద్ధమని చెప్పారు. స్పీకర్ కు తెలియకుండా వీడియో ఫుటేజిని లీక్ చేసిన చీఫ్ విప్ కాల్వ శ్రీనివాసులపై చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేస్తున్నారు. అయితే మరోసారి రోజాను సస్పెండ్ చేస్తే న్యాయపోరాటం చేస్తామని చెబుతున్నారు వైసీపీ నేతలు.

Similar News