రైతును మోసం చేస్తే జైలుకే

Update: 2017-02-01 04:39 GMT

తెలంగాణ రాష్ట్రం రైతులను ఆదుకునేందుకు మరో ప్రయత్నం ప్రారంభించింది. కల్తీ విత్తన విక్రయదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. నకిలీ విత్తనాలతో అన్నదాతలు మోసపోతున్నారు. పేరున్న కంపెనీలే నకిలీ విత్తనాలు అంటగడుతుండటంతో అవి వినియోగించిన రైతులకు పెట్టుబడి కూడా రావడం లేదు. దిగుబడి కన్పించడం లేదు. దీనిపై సరైన చట్టాలు లేనందును నకిలీ విత్తన కంపెనీలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయన్న విమర్శ ఉంది. అయితే నకిలీ విత్తన కంపెనీల ఆటకట్టించేందుకు తెలంగాణ ప్రభుత్వం కొత్త నర్సరీ చట్టాన్ని రూపకల్పన చేసింది.

కొత్త చట్టంలో ఇలా....

పత్తి, మిరప, వరి, ఇలా ఒకటేమిటి? ఎక్కడ చూసినా నకిలీ విత్తనాలే. తీరా పంట చేతికొచ్చే సమయానికి గాని రైతులకు అవి నకిలీ విత్తనాలని అర్ధం కావడం లేదు. దీంతో ముఖ్యమంత్రి కేసీఆర్ విత్తన కంపెనీలపై కఠిన చట్టాలు తేవాలని నిర్ణయించారు. రైతులకు నష్టం తెచ్చే వారిని ఎట్టి పరిస్థితుల్లో వదలకుండా చట్టాలను రూపొందించాలని అధికారులను ఇదివరకే కేసీఆర్ ఆదేశించారు. అవసరమైతే పీడీ యాక్టు కూడా పెట్టాలని కేసీఆర్ అధికారులకు సూచించారు. ఈ మేరకు అధికారులు కొత్త చట్టాన్ని రూపొందించారు. దీంతో కొత్త నర్సరీ చట్టం అమల్లోకి తీసుకొచ్చింది తెలంగాణ సర్కార్. 27 పేజీలతో కూడిని ఈ నర్సరీ -2017 చట్టం ప్రకారం ఇకపై నకిలీ విత్తనాలను రైతులకు సరఫరా చేస్తే జైలుకు వెళ్లాల్సిందే. నర్సరీ యజమానునలు విత్తనాలను ఎక్కడి నుంచి సేకరించారు? బిల్లులు, లాట్, బ్యాచ్ నెంబర్లు, విత్తన పరీక్ష నెంబర్లన్నింటినీ ఫైల్ చేయాల్సి ఉంటుంది. నిబంధనలను పాటించని వారిపై యాభై వేల జరిమానా లేదా ఏడాది పాటు జైలుశిక్ష అనుభవించాల్సి ఉంటుందని చట్టంలో పేర్కొన్నారు. రెవెన్యూ, పోలీసు, మండల, విజిలెన్స్ అధికారులకు నర్సరీలను ఎప్పటికప్పుడు పరిశీలించే అధికారాన్ని కట్టబెట్టారు. మొత్తం ఇకపై రైతును నకిలీ విత్తనాలతో మోసం చేస్తే జైలుకు వెళ్లక తప్పదు.

Similar News