రేవంత్ రెడ్డి పోరుబాటకు ఫుల్ స్టాప్

Update: 2016-11-30 21:34 GMT

రేవంత్ రెడ్డి రైతు పోరుబాట ముగిసింది. కేసీఆర్ ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నదని... రైతులకు ద్రోహంచేస్తున్నదని ఆరోపిస్తూ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ప్రారంభించిన రైతు పోరుబాట ముగిసింది. పదునైన విమర్శలతో కేసీఆర్ పాలన మీద విరుచుకుపడుతూ ఉండే రేవంత్ రెడ్డి దూకుడుకు ఇక కాస్త విరామం లభించినట్లే. రైతు వ్యతిరేక ప్రభుత్వానికి నిరసనగా, ఈ నెల 6వ తేదీన జయశంకర్ జిల్లా భూపాలపల్లి లో ప్రారంభమైన పోరుబాట యాత్ర... బుధవారం నాడు రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం లోని కోస్గిలో బహిరంగసభతో ముగించారు.

ఈసభలో తెలుగుదేశ పార్టీ తెలంగాణకు చెందిన ప్రముఖ నాయకులు అందరూ పాల్గొన్నారు. సహజంగానే కేసీఆర్ సర్కారు గురించి తెదేపా వారు నిత్యంచేసే ఆరోపణలనే మరోసారి వినిపించారు. రాష్ట్రంలో రైతాంగం మొత్తం దుర్భర పరిస్థితుల్లో ఉన్నారని, తన ఫాం హౌస్ సేద్యం ద్వారా ఎకరాకు లక్షలు సంపాదిస్తున్న కేసీఆర్, అదే వ్యవసాయాన్ని రాష్ట్రంలో రైతులందరికీ అందుబాటులోకి తీసుకురావాలని రేవంత్ రెడ్డి విమర్శించారు. తనకోసం పేదల సొమ్ముతో వంద గదులతో భవంతి నిర్మించుకున్న కేసీఆర్, పేదలకు టూబెడ్ రూం ఇళ్లు నిర్మించడంలో చురుగ్గా వ్యవహరించడం లేదని కూడా విమర్శించారు.

అయితే ఇంకా చాలాకాలం సాగాల్సి ఉన్న రేవంత్ రెడ్డి పోరుబాట సగంలో ముగిసిపోయిందనే అభిప్రాయం పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. ఇంతకూ రేవంత్ రెడ్డి తాను సంకల్పించిన రైతుపోరుయాత్రను మనస్ఫూర్తిగానే ముగింపు పలికారా? లేదా, దానిని బలవంతంగా ఆపేయాల్సి వచ్చిందా? అనే అభిప్రాయమూ వ్యక్తమవుతోంది. రాజకీయంగా రేవంత్ రెడ్డి చేపట్టిన యాత్ర నేపథ్యంలో పార్టీలో కొన్ని లుకలుకలు బయటకు వచ్చాయని ఆ నేపథ్యంలో యాత్రను ఆపేస్తున్నారనే వాదన కూడా వినిపిస్తోంది.

Similar News