రేవంత్ పై టీఆర్ఎస్ వ్యూహాత్మక మౌనం ఎందుకో?

Update: 2017-11-11 07:30 GMT

రేవంత్ రెడ్డి వ్యవహారంలో టీఆర్ఎస్ ఆచితూచి వ్యవహరిస్తోంది. రేవంత్ రెడ్డి బలం..బలగం ఏంటో కేసీఆర్ కు తెలుసు. అందుకే ఆయన పార్టీ నేతలను రేవంత్ పై దూకుడు ప్రదర్శించరాదని హెచ్చరికలు జారీ చేశారట. రేవంత్ వ్యవహారంలో పకడ్బందీ గా ముందుకు వెళ్లాలని తొందరపడకూడదని సీఎం కేసీఆర్ ముఖ్యమైన మంత్రులకు తెలిపారు. తొలుత నియోజకవర్గం పై పట్టుపెంచుకోవాలని కేసీఆర్ సూచించారు. నిజానికి కొడంగల్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ బలం అంతాగా లేదు. కాంగ్రెస్ పార్టీకి కూడా క్యాడర్ తక్కువే. కాని రేవంత్ చేరడంతో కాంగ్రెస్ బలం పెరిగింది. దీంతో కేసీఆర్ ముందుగా కొడంగల్ నియోజకవర్గంపై దృష్ి పెట్టాలని ఆదేశించారు. ఎవరూ మాట్లాడవద్దని చెప్పారు. అందుకే టీఆర్ఎస్ పార్టీ రేవంత్ రాజీనామాపై వ్యూహాత్మక మౌనాన్ని పాటిస్తోందన్న వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి. కొడంగల్ లో పార్టీ బలం పెరిగిందని తెలుసుకున్న తర్వాతనే రేవంత్ రాజీనామా వ్యవహారాన్ని తేల్చాలని కేసీఆర్ నిర్ణయించినట్లుతెలుస్తోంది.

కొడంగల్ లో బలం పెంచుకున్నాకనే....

కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశానని చెబుతున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబుకు ఆ రాజీనామా లేఖను ఇచ్చానని అంటున్నారు. కాని మరోవైపు టీటీడీపీ అధ్యక్షులు రమణ మాత్రం చంద్రబాబు వద్ద రాజీనామా లేఖ లేదని చెబుతున్నారు. స్పీకర్ కు చేరలేదంటున్నారు. ఇంతకీ రేవంత్ రాజీనామా లేఖ ఎక్కడుంది? ఈ విషయాన్ని టీఆర్ఎస్ రచ్చ రచ్చ చేసే అవకాశం ఉంది. అయినా కేసీఆర్ సూచనలతో ఎవరూ రేవంత్ రాజీనామా విషయంపై మాట్లాడటం లేదు. ఇప్పటికే కొడంగల్ నియోజకవర్గానికి ముగ్గురు మంత్రులను నియమించారు. మంత్రి హరీశ్ రావుకు కొడంగల్ బాధ్యతలను అప్పగించారు. కొడంగల్ నియోజకవర్గం కర్ణాటక రాష్ట్ర సరిహద్దుల్లో ఉంటుంది. ఇక్కడ టీఆర్ఎస్ అంత బలంగా లేదు. ఇప్పటికే ముగ్గురు మంత్రులు కొడంగల్ పై కన్నేసి స్థానిక టీడీపీ, కాంగ్రెస్ నేతలను గులాబీ గూటికిచేర్చే కార్యక్రమాన్ని ప్రారంభించారు. రాజీనామా ఆమోదిస్తే ఉప ఎన్నిక రావడం ఖాయం. ఉప ఎన్నికలో ఓటమి పాలయితే ఆ ప్రభావం వచ్చే సాధారణ ఎన్నికలపై పడుతుంది. అందువల్లనే కేసీఆర్ ముందుగా కొడంగల్ లో బలం పెంచుకుని ముగ్గురు మంత్రుల నుంచి పోటీకి రెడీ అని సిగ్నల్ రాగానే రేవంత్ రాజీనామాపై కేసీఆర్ దృష్టిపెట్టనున్నట్లు చెబుతున్నారు. మొత్తం మీద రేవంత్ వ్యవహారంలో టీఆర్ఎస్ వ్యూహాత్మకంగా వ్యవహరించడానికి కొడంగల్ లో బలం పెంచుకోవడానికేనన్నది పార్టీ ఇన్నర్ వర్గాల టాక్.

Similar News