రేవంత్ పై కసి తీర్చుకుంటున్నారా?

Update: 2017-11-09 05:30 GMT

రేవంత్ రెడ్డి టీడీపీని వదిలి కాంగ్రెస్ లో చేరడంతో తెలంగాణలోని అన్ని జిల్లాల్లో ఆయన సన్నిహితులు, అనుచరులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాని పాలమూరు జిల్లాలో మాత్రం రేవంత్ కు ఎదురుగాలి వీచిందనే చెప్పాలి. పాలమూరు జిల్లా నుంచి రేవంత్ వెంట వస్తారనుకున్న వారు కూడా రాకపోవడం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చర్చనీయాంశంగా మారింది. రేవంత్ వెంట కొత్త కోట దయాకర్ రెడ్డి, సీతా దయాకర్ రెడ్డి, కొడంగల్ నియోజకవర్గానికి చెందిన టీడీపీ నేతలు పెద్దయెత్తున వచ్చి కాంగ్రెస్ లో చేరతారని కాంగ్రెస్ నేతలు భావించారు. రేవంత్ రాహుల్ కు ఇచ్చిన జాబితాలో పాలమూరు జిల్లా టీడీపీ నేతలు ఎవరూ రాకపోవడం ఆయనకు కొంత ఇబ్బందిగా మారింది. ఈ మేరకు స్థానిక నేతలకు కూడా కొంత సర్దిచెప్పారు. వచ్చే ఎన్నికల్లో ఇబ్బంది ఏమీ ఉండదని ఇప్పటికే అక్కడ ఉన్న కాంగ్రెస్ నేతలకు పార్టీ భరోసా ఇచ్చినా వారికి ఎక్కడో అనుమానం ఉంది. అయితే రేవంత్ వెంట పార్టీ నేతలు ఎవరూ ఇప్పటి వరకూ రాకపోవడంతో ఆ జిల్లా కాంగ్రెస్ నేతలు ఊపిరి పీల్చుకుంటుండగా, కాంగ్రెస్ సీనియర్ నేతలు మాత్రం సొంత జిల్లా నేతలు ఎందుకు రాలేదన్న దానిపై ఆరా తీయడం ప్రారంభించారు.

ఆపరేషన్ కొడంగల్ స్టార్ట్....

ఇక రేవంత్ సొంత నియోజకవర్గమైన కొడంగల్ లో టీఆర్ఎస్ పెద్దయెత్తున ఆపరేషన్ ఆకర్ష్ ను ప్రారంభించి దాదాపుగా సక్సెస్ అయింది. కొడంగల్ నుంచి టీడీపీ నేతలను ఇప్పటికే చేర్చుకున్న టీఆర్ఎస్ కాంగ్రెస్ నేతలకు కూడా గాలం వేసింది. రేవంత్ వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో అక్కడ ఉన్నా ప్రయోజనమేమీ లేదని, ఇక్కడకు వస్తే నామినేటెడ్ పోస్టులు ఇస్తామని నమ్మకంగా చెబుతోంది. దీంతో కొడంగల్ నియోజకవర్గంలోని కాంగ్రెస్ నేతలు కొందరు గులాబీ పార్టీలో చేరిపోయారు. దీంతో రేవంత్ అప్రమత్తమయ్యారు. కొడంగల్ నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో ఆత్మీయ సమ్మేళనాలను రేవంత్ ఏర్పాటు చేస్తున్నారు. ఉన్న క్యాడర్ జారిపోకుండా రేవంత్ జాగ్రత్తలు తీసుకున్నారు. బుధవారం కోస్గి మండలంలో జరిగిన ఆత్మీయ సమ్మేళనానికి రేవంత్ హాజరయ్యారు. తన వెంట నడిస్తే భవిష్యత్తు ఎలా ఉంటుందో రేవంత్ వారికి చెబుతున్నారు. మొత్తం మీద రేవంత్ ను ఒంటరి చేయడానికి టీఆర్ఎస్ చేస్తున్న ప్రయత్నాలు కొంత ఫలితాలనే ఇచ్చాయి. మరోవైపు త్వరలోనే పాలమూరు జిల్లా నుంచి టీడీపీ నేతలు కాంగ్రెస్ లో చేరతారని రేవంత్ అనుచరులు చెబుతున్నారు.

Similar News