రేవంత్ చేరిక తర్వాత కాంగ్రెస్ లో....?

Update: 2017-11-06 09:30 GMT

రేవంత్ రెడ్డి చేరికతో కాంగ్రెస్ పార్టీ దూకుడు పెంచింది. రేవంత్ చేరిన నాటి నుంచి కాంగ్రెస్ లో చేరికలు ఊపందుకున్నాయి. ఒకవైపు అధికార టీఆర్ఎస్ పార్టీ కూడా చేరికలను ప్రోత్సహిస్తుండగా... పేరున్న నేతలు ఎవరూ అధికార పార్టీలోకి రాకపోవడం గమనార్హం. మరోవైపు టీడీపీ, బీజేపీలు చేరికలను చూస్తూ ఉండిపోవడం తప్ప ఏమీ చేయలేకపోతున్నాయి. అధికార టీఆర్ఎస్ పార్టీకి సరైన ప్రత్యామ్నాయం కాంగ్రెస్ అనేది నేతలు గట్టిగా నమ్ముతున్నారు. ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ నేతల్లో కొంచెం క్లారిటీ వస్తుంది. వచ్చే ఎన్నికల్లో పోటీ అధికార టీఆర్ఎస్ ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీల మధ్యనే ఉంటుందని లీడర్లు విశ్వసిస్తున్నారు. మూడున్నరేళ్ల టీఆర్ఎస్ పాలనలో టీఆర్ఎస్ చేపట్టిన ప్రజా వ్యతిరేక నిర్ణయాలను కాంగ్రెస్ ప్రజల్లోకి తీసుకెళ్లే కార్యక్రమం చేపట్టింది.

కాంగ్రెస్ లో మరిన్ని చేరికలు....

తెలంగాణ ప్రజలు చైతన్యం కలిగిన ఓటర్లుగా గుర్తింపు పొందారు. కుల, మతాలకు అతీతంగా వామపక్షభావాజాలం ఉన్న ఓటర్లు తెలంగాణలో ఎక్కువ కావడంతో నేతలు పార్టీలు మారినా ఓటర్లు మారరన్నది అధికార పార్టీ నమ్మకం. ఆ నమ్మకంతోనే ప్రజలకు చేరువయ్యేందుకు టీఆర్ఎస్ ప్రయత్నిస్తోంది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నిన్న మొన్నటి దాకా చేష్టలుడిగి చూస్తుంది. అధికార పార్టీకి ధీటుగా సమాధానం చెప్పే ప్రయత్నమూ చేయలేదు. దిగ్విజయ్ సింగ్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జిగా ఉన్నంతకాలం పార్టీ స్దబ్దుగా ఉందన్న విమర్శలు ఉన్నాయి. అయితే కుంతియాను ఇన్ ఛార్జిగా నియమించిన తర్వాత చేరికలతో పాటు అధికార పార్టీపై విరుచుకుపడటం ప్రారంభించింది. ముఖ్యంగా ఇంతకాలం పార్టీకి దూరంగా ఉంటున్న నేతలు కూడా దగ్గరవుతున్నారు. విజయశాంతి తిరిగి పార్టీ నేతలతో చర్చించడమే ఇందుకు ఉదాహరణగా చెబుతున్నారు. రాహుల్ ఈ నెల 20వ తేదీన వరంగల్ లో జరుగుతున్న సభకు హాజరుకానున్నారు. ఈ సభలో మరికొందరు కీలక నేతలు చేరే అవకాశముందని పార్టీ నేతలు చెబుతున్నారు. మొత్తం మీద కాంగ్రెస్ పార్టీలో రేవంత్ చేరిక తర్వాతనే జోష్ పెరిగిందన్న వ్యాఖ్యలు ఆ పార్టీలోనే విన్పిస్తున్నాయి. మొత్తం మీద గత కొద్దిరోజులుగా గాంధీ భవన్ కళకళలాడుతోంది.

Similar News