రావణకాష్టం మళ్లీ రచ్చకెక్కుతోంది

Update: 2016-11-21 23:19 GMT

రెండు తెలుగు రాష్ట్రాల మద్య అపరిష్కృతంగా ఉన్న తీవ్ర వివాదాస్పద విషయాల్లో క్రిష్ణా జలాల వినియోగానికి సంబంధించి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం చాలా కీలకమైనది. అయితే తెలంగాణ ప్రభుత్వం ఈ ప్రాజెక్టు కోసం ఎలాంటి అనుమతులు తీసుకోకుండానే నిర్మాణాలు చేపడుతున్నదని, దీనివల్ల ఏపీ లోని ప్రాంతాలు, ప్రధానంగా కరవు ప్రాంతం రాయలసీమ దారుణంగా దెబ్బతింటుందని చాలా కాలంగా ఒక పోరాటం నడుస్తున్నది. ఈ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా ఏపీలో కాంగ్రెస్, వైకాపా లు గతంలో ఉద్యమాలు కూడా చేశాయి. పాలక తెలుగుదేశం పార్టీ ఏకంగా కేంద్రానికి ఫిర్యాదు చేశారు.

ఏపీ ఫిర్యాదుతో ప్రాజెక్టు పనులకు బ్రేక్ పడ్డప్పటినుంచి తెలంగాణ తెరాస సర్కారులో చాలా అసహనం కనిపిస్తోంది. చంద్రబాబునాయుడు మా రాష్ర్ట్రప్రగతిని అడ్డుకుంటున్నాడంటూ నానా మాటలూ అంటున్నారు. అయితే తాజాగా పాలమూరు రంగారెడ్డి నిర్మాణానికి సంబంధించిన అంశం మరోమారు చర్చల్లోకి వస్తోంది. తెలంగాణ సర్కారు ఎలాంటి అనుమతులు లేకుండానే దీని నిర్మాణానికి పూనుకోవడం అనే అంశాన్ని తెరమీదకు తెస్తోంది. అయితే ఈసారి ఏపీ దీనిని పంచాయతీ పెట్టడం లేదు. సాక్షాత్తూ తెలంగాణకు చెందిన కాంగ్రెస్ ఎంపీ దీని గురించిచ సభలో ప్రస్తావిస్తే.. నీటివనరుల మంత్రి ఉమాభారతి చాలా విస్పష్టంగా సమాధానం చెప్పేశారు. తెలంగాణ దీని గురించి అసలు కేంద్రానికి సమాచారమే ఇవ్వలేదని, అనుమతులు కోరలేదని, డీపీఆర్ కూడా ఇవ్వలేదని తేల్చేశారు.

పాల్వాయి గోవర్దనరెడ్డి సభలో అడిగిన ప్రశ్నకు వచ్చిన సమాధానాన్ని ఏపీ సర్కారు తమకు రాజకీయ ప్రయోజనం కలిగేలా వాడుకోడానికి అవకాశం ఉంది. అదే సమయంలో తెరాస దళాలు అటు ఏపీ సర్కారును, ఈ వివాదాన్ని ఇప్పుడు మళ్లీ తెరమీదకు తెచ్చిన పాల్వాయి గోవర్దన రెడ్డిని కూడా ఆడిపోసుకుంటాయనడంలో సందేహం లేదు.

Similar News