రాయపాటి సహృదయం : సుష్మాకి కిడ్నీ ఇవ్వడానికి సిద్ధం!

Update: 2016-11-18 12:36 GMT

కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్ పట్ల తనకున్న ఆదరణ, అభిమానాన్ని చాటుకోవడం మాత్రమే కాదు... అవసరమైతే ఆమెకోసం తాను ఎంతటి త్యాగానికి కూడా సిద్ధంగానే ఉండగలననే సహృదయతను తెలుగుదేశం పార్టీ ఎంపీ , సీనియర్ నాయకుడు రాయపాటి సాంబశివరావు ప్రదర్శించారు. ప్రస్తుతం కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతూ చికిత్స పొందుతున్న విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మాస్వరాజ్ కు, అవసరమైతే తన కిడ్నీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానంటూ నరసరావుపేట ఎంపీ 73 ఏళ్ల రాయపాటి సాంబశివరావు ఆమెకు లేఖ రాశారు.

‘‘మీ అనారోగ్యం గురించి తెలుసుకుని చాలా బాధ కలిగింది. కిడ్నీ మార్పిడి అవసరమని ఎయిమ్స్ వైద్యులు సూచించిన నేపథ్యంలో.. మార్పిడికి నా కిడ్నీని స్వీకరించడానికి మీరు అంగీకరించినట్లయితే... నేనెంతో సంతోషిస్తాను’’ అని రాయపాటి సాంబశివరావు ఆమెకు లేఖ రాశారు.

ఎయిమ్స్ వైద్యులు చెబుతున్న దాన్ని బట్టి, సుష్మాస్వరాజ్ కు తగిన కిడ్నీ కోసం ప్రయత్నిస్తున్నారు. దాత లభించిన తర్వాత.. శస్త్రచికిత్స చేసే తేదీని ఖరారు చేస్తారు.

బుధవారం నాడు సుష్మ స్వరాజ్ తన అనారోగ్యం గురించి ట్వీట్ చేశారు. ‘‘కిడ్నీ విఫలం కావడంతో ప్రస్తుతం డయాలసిస్ మీద ఉన్నాను. మార్పిడి కోసం చూస్తున్నాం. కృష్ణ భగవానుడే ఆశీర్వదించాలి’’ అని పేర్కొన్నారు. దానికి స్పందనగానే రాయపాటి సాంబశివరావు తన కిడ్నీ ఇవ్వడానికి అంగీకారాన్ని తెలియజేయడం విశేషం.

Similar News