రాజ్యాంగ చిక్కుముడిగా మారిన అనర్హత గొడవ!

Update: 2016-11-09 03:32 GMT

తెలుగుపోస్ట్ అనుమానించిన తీరులోనే పరిణామాలు కూడా చోటు చేసుకున్నాయి. తెలంగాణలో ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హత గురించి నిర్ణయం తీసుకునే విషయంలో ఇంచుమించుగా రాజ్యాంగ ప్రతిష్టంభన ఏర్పడింది. సుప్రీం కోర్టులో జరిగిన విచారణలో.. ముందుగా అనుమానించినట్లే.. అసెంబ్లీ స్పీకరు మధుసూదనాచారి అసలు తనను ఆదేశించిన మేరకు ఎలాంటి అఫిడవిట్ ను సమర్పించనే లేదు. స్పీకరు విధుల్లో జోక్యం చేసుకునే, ఆయనకు నిర్దేశించే అధికారమే కోర్టులకు లేదంటూ, అసలు సుప్రీం అధికారాల మీదనే కోర్టులో ఎక్కువ చర్చ జరగడం విశేషం. సందేహాలు నివృత్తి కాకపోవడంతో.. సుప్రీం న్యాయమూర్తులు కూడా ఈ అంశాన్ని అయిదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనానికి నివేదించే పరిస్థితి వచ్చింది. ఈ కేసు కోసం సుప్రీం కోర్టు రాజ్యాంగ ధర్మాసనాన్ని ప్రత్యేకంగా ఏర్పాటుచేసి.. విచారించి నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

తెలంగాణ ఎమ్మెల్యేల ఫిరాయింపు- వారిపై అనర్హత వేటుకు సంబంధించి.. మంగళవారం సుప్రీం కోర్టులో విచారణ ఉన్న నేపథ్యంలో.. కోర్టులో విచారణ జరిగినంత మాత్రాన ఏ సంగతి తేలకపోవచ్చునని తెలుగుపోస్ట్ కూడా ముందే విశ్లేషించింది. ఆ ప్రకారమే తెలంగాణ స్పీకర్ మధుసూదనాచారి.. తాను నిర్ణయం తీసుకోవడానికి ఎంత గడువుకావాలో సుప్రీం కోర్టుకు అఫిడవిట్ రూపంలో తెలియజేయాల్సి ఉండగా.. ఆయన ఆ పని చేయలేదు. దానికి బదులుగా ఆయన తరఫు అటార్నీ జనరల్ రోహత్గీ.. అసలు స్పీకరు విధుల్లో కోర్టులు జోక్యం చేసుకోలేవని వాదించారు.

ఈ సందర్భంగా సుప్రీం కోర్టు న్యాయమూర్తులు చేసిన వ్యాఖ్యలు గమనించదగినవి. రాజ్యాంగబద్ధమైన అధికారాలు ఉన్నాయి గనుక.. స్పీకరు నిర్ణయం తీసుకోకుండా అయిదేళ్లూ కాలయాపన చేస్తే కోర్టులు చూస్తూ ఊరుకోవాలా అనే వ్యాఖ్యలను తీవ్రమైనవిగానే పరిగణించాల్సి ఉంది. మొత్తానికి అనుకున్నట్లుగానే తెలంగాణ స్పీకరు నిర్ణయం తీసుకోకపోవడం అనేది రాజ్యాంగపరమైన సమీక్షకు దారితీస్తున్నది. రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటై ఈ విషయంలో నిర్ణయం తీసుకుంటుంది. అప్పటిదాకా.. రాజ్యాంగ- న్యాయపరమైన అంశాల్లో అయినా.. మొండివాడు రాజుకంటె బలవంతుడు అనే సిద్ధాంతమే నిత్యసత్యమని నమ్ముతూ ఉండాల్సిందే.

Similar News