రాజీనామాలకూ ఢిల్లీ అనుమతి కావాలా?

Update: 2018-03-14 09:03 GMT

గవర్నర్ ప్రసంగంలో ఎటువంటి అసత్యాలు లేవని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. విపక్షాలు అడ్డగోలుగా విమర్శలు చేస్తున్నాయన్నారు. 16 మంది ముఖ్యమంత్రులు తనకంటే ముందు పనిచేశారని, వారు అప్పులు చేయలేదని, తాను రెండు లక్షల కోట్లు అప్పుచేశామని ఆరోపిస్తున్నారని, ఇది సత్యదూరమన్నారు. రాష్ట్ర ఆదాయం నెలకు 10,500 కోట్లు మాత్రమేనన్నారు. కేసీఆర్ అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ప్రసంగించారు. తాము పూర్తిగా ప్రజాస్వామ్యబద్ధంగానే వ్యవహరిస్తున్నానని చెప్పారు. తుమ్మినా, దగ్గినా కాంగ్రెస్ నేతలకు ఢిల్లీ నుంచి అనుమతి రావాలన్నారు. తెలంగాణను రాకుండా అడ్డుకున్నది కాంగ్రెస్ నాయకులేనన్నారు. తెలంగాణ వెనుకుబాటు తనానికి కాంగ్రెస్ కారణమన్నారు. 1956 నుంచి తెలంగాణ నాశనానికి కారణమైంది కాంగ్రెస్ నేతలేనన్నారు. అధికారం కోసం, పదవుల కోసం, చిల్లర మల్లర పైరవీల కోసం కాంగ్రెస్ నేతలు తెలంగాణతో ఆడుకున్నారని, వాడుకున్నారని కేసీఆర్ తీవ్రంగా విమర్శించారు. చిత్తశుద్ధి ఉంటే మూకుమ్మడి రాజీనామాలు చేయవచ్చు కదా? అని కేసీఆర్ ప్రశ్నించారు. రాజీనామాలకు కూడా ఢిల్లీ పర్మిషన్ కావాలా? అని నిలదీశారు. సభలో నిరసనలు సరికాదన్నారు. ఇద్దరి సభ్యులపై వేటు పడిందని, మరో ఇద్దరి సభ్యుల తీరును పరిశీలిస్తున్నామని చెప్పారు. తెలంగాణ ఇవ్వడం ఎంత ముఖ్యమో, దానిని నిలబెట్టడం అంతే ముఖ్యమన్నారు. ఇతర పార్టీల ఎమ్మెల్యేలను తాము అందుకోసమే తీసుకున్నామని చెప్పారు. తెలంగాణను నిలబెట్టుకోవడం కోసమే ఇతర పార్టీల ఎమ్మెల్యేలను చేర్చుకున్నామన్నారు. ప్రభుత్వాన్ని కూల్చి వేసే కుట్ర జరిగిందన్నారు. కాంగ్రెస్ పార్టీ తీరును కేసీఆర్ ఎండగట్టారు.

Similar News