రాజకీయాలు కాదు...ప్రజాసేవే ముఖ్యం : చంద్రబాబు

Update: 2017-01-11 12:46 GMT

పైడిపాలెం ఎత్తిపోతల పథకాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారు. కడప జిల్లా పులివెందులకు నీళ్లందించే ఈ పథకానికి ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారభించిన అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించారు. కడప జిల్లాతో పాటు కరవుతో అల్లాడుతున్న పులివెందులకు నీరివ్వడం ఆనందంగా ఉందన్నారు. ఈరోజును తన జీవితంలో మర్చిపోలేనని చెప్పారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక కొందరు ప్రాజెక్టులకు అడ్డుపడుతున్నారని విమర్శించారు. ఎప్పుడూ రాజకీయాలు ముఖ్యం కాదని ప్రజాసేవే ముఖ్యమని ఆయన ఉద్భోదించారు. ఆర్థికంగా రాష్ట్రం ఎన్నో కష్టాలు ఎదుర్కొంటున్నా సంక్షేమ కార్యక్రమాలను మాత్రం పేదలకు అందిస్తున్నామని తెలిపారు.

ఈ సభలో ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మాట్లాడుతూ కేవలం కులంతో రాజకీయం చేయడం కుదరదన్నారు. అభివృద్ధిని అడ్డుకుంటే భవిష్యత్తులో ప్రజలు మద్దతివ్వరన్నారు. జగన్ వి అన్ని తాత పోలికలేనని, వాళ్ల నాయన లక్షణాలు ఒకటీ రాలేదని ఎద్దేవా చేశారు. జేసీ వైసీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డిపైనా ధ్వజమెత్తారు. శ్రీకాంత్ రెడ్డికి విషయం తెలియకుండా మాట్లాడుతున్నాడన్నారు. నా నాలుక కోస్తానంటావా? అంత మగాడివా? అని శ్రీకాంత్ రెడ్డిని ప్రశ్నించారు. పైడిపాలెం ఎత్తిపోతల పథకం ప్రారంభమవ్వడంతో ఎమ్మెల్సీ సతీష్ రెడ్డి తన జలదీక్షను విరమించారు. 2015లో సతీష్ రెడ్డి పులివెందులకు నీళ్లిచ్చే వరకూ గడ్డం తీయనని శపథం చేశారు. ఈరోజు నీళ్లురావడంతో గడ్డం తీయించుకున్నారు.

Similar News