మోపిదేవి మాత్రమే ఎందుకు అరెస్టయ్యారు......మిగిలిన మంత్రులు ఎందుకు సేవ్ అయ్యారు.....

Update: 2017-02-26 12:57 GMT

జగన్‌ ఆస్తుల కేసులో అరెస్టై జైలు జీవితాన్ని అనుభవించిన మంత్రి మోపిదేవి వెంకటరమణ...... 2012 మే 24వ తేదీన అప్పటి ఎక్సైజ్‌ శాఖ మంత్రిగా ఉన్న మోపిదేవిని సిబిఐ అరెస్ట్‌ చేసింది. ఈ సంగతి ప్రజలు పెద్దగా గుర్తు పెట్టుకోకపోవచ్చు కాని మిగిలిన మంత్రులు ఎవరిని అరెస్ట్‌ చేయని సిబిఐ మోపిదేవిపై మాత్రం ఎందుకు కక్ష కట్టిందనేది అంతుచిక్కదు. దాదాపు ఐదేళ్ల తర్వాత మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రమాకాంత్‌ రెడ్డి వివరణతో చాలా ప్రశ్నలకు సమాధానాలు దొరుకుతున్నాయి.

కాంగ్రెస్‌ పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా జగన్‌ ఓదార్పు యాత్ర ప్రారంభించగానే ఎమ్మెల్యేలు., మంత్రుల్లో చీలిక వచ్చేసింది. అదే సమయంలో జగన్‌ కు ప్రత్యక్షంగా పరోక్షంగా మద్దతునిచ్చిన మంత్రులు పరిమితంగా ఉండిపోయారు. చాలామంది కాంగ్రెస్‌ పెద్దలు కన్నెర్ర చేయడంతో ఏమి పాలుపోకుండా ఉండిపోయారు. ఓదార్పు యాత్ర కొనసాగించేందుకు అనుమతి కోసం జగన్ ప్రయత్నించినా అది సఫలం కాలేదు. కుటుంబ సమేతంగా 10 జన్‌పథ్‌లో తమ వాదన వినిపించేందుకు జగన్‌ చేసిన ప్రయత్నాలను సోనియా గాందీ నిర్ద్వందంగా తిరస్కరించడంతో జగన్ కుటుంబం తీవ్ర మనస్థాపానికి గురైంది. అదే సమయంలో కాంగ్రెస్‌ పార్టీతో తాడోపేడో తేల్చుకునేందుకు జగన్‌ సిద్ధమయ్యాడు. ఒకానొక సమయంలో రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని జగన్‌ కూలుస్తాడని వైరి వర్గం ఢిల్లీకి ఫిర్యాదు చేయడంతో ఢిల్లీ పెద్దలు దూకుడుగా వ్యవహరించారు. ఆ క్రమంలోనే వైఎస్‌ క్యాబినెట్‌లో తీసుకున్న వివాదాస్పద నిర్ణయాలను తెరపైకి తీసుకొచ్చారు. ఈ మొత్తం వ్యవహారంలో వైఎస్‌ క్యాబినెట్‌ సహచరులందరికి చుట్టుకునే ప్రమాదం ఉన్నా అప్పటి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి చూసిచూడనట్లు వ్యవహరించారు. సిబిఐ విచారణ కోసం మోపిదేవిని పిలిచినపుడు కూడా కిరణ్‌ అధిష్టానాన్ని సంప్రదించే ప్రయత్నం చేయలేదట.... అప్పటికే ముఖ్యమంత్రి పదవిలో కుదురుకునే ప్రయత్నాల్లో ఉన్న కిరణ్‌కుమార్‌ రెడ్డి జగన్‌కు వ్యతిరేకంగా జరుగుతున్న పరిణామాలను తనకు అనుకూలంగా మార్చుకునేందుకు ప్రయత్నించారు. మే 23న రోజంతా మోపిదేవిని ప్రశ్నించిన సిబిఐ., ఆ తర్వాతి రోజు అరెస్ట్‌ చేస్తున్నట్లు ప్రకటించింది. మోపిదేవి అరెస్ట్‌కు ముందు ఎంపీ ఉండవల్లితో పాటు మరికొందరు నేతలు మోపిదేవితో చర్చలు జరిపారు. ఆ తర్వాత మోపిదేవి పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటన విడుదలైంది.

ఈ మొత్తం వ్యవహారంలో కాంగ్రెస్‌ పార్టీ కనుసన్నల్లోనే కక్ష సాధింపు చర్యలు కొనసాగినట్లు స్పష్టమవుతుంది. అదే సమయంలో మోపిదేవి బీసీ వర్గాలకు చెందిన మంత్రి కావడంతో మిగిలిన మంత్రి వర్గ సహచరులు కూడా పెద్దగా ఆసక్తి చూపలేదు. అదే సమయంలో ధర్మాన ప్రసాదరావు., సబితా ఇంద్రారెడ్డి., రఘువీరారెడ్డి., కన్నా‌ లక్ష్మీనారాయణ., బొత్స సత్యనారాయణ వారి పేర్లు కూడా మీడియాలో ప్రచారమయ్యాయి. మిగిలిన మంత్రుల్ని కూడా సిబిఐ అరెస్ట్‌ చేస్తుందనే ప్రచారంతో కిరణ్‌ కుమార్‌ రెడ్డికి సహకరించని మంత్రులంతా దారికొచ్చేశారు. అదే సమయంలో కాంగ్రెస్‌ పార్టీ కూడా మంత్రులందర్ని వరుస పెట్టి జైలుకు పంపితే అది జగన్‌ ను ఇబ్బంది పెట్టడం కంటే కాంగ్రెస్‌కే ఎక్కువ చేటు చేస్తుందని వివరించడంతో వారంతా బయటపడ్డారు. మొత్తం మీద కిరణ‌్‌ కుమార్‌ రెడ్డితో ఉన్న విభేదాలు., జగన్‌కు వ్యతిరేకంగా సాగిన కుట్ర రాజకీయాలకు మోపిదేవి ఒక్కడే బలైపోయాడు. ధర్మాన ప్రసాదరావు కాంగ్రెస్‌ పెద్దలతో మొదట రాజీ కుదుర్చుకున్నా ఆ తర్వాత భవిష్యత్తులో అది ప్రమాదకరమని గుర్తించి ఆ పార్టీ నుంచి తప్పుకున్నారు.

Similar News