మోదీకి కేసీఆర్ బెదిరింపులు : నిజమా? ఉత్తుత్తివా?

Update: 2016-12-18 02:50 GMT

నోట్ల రద్దు నిర్ణయం వచ్చిన తర్వాత... తొలి రెండు మూడు రోజుల్లో దాని తాలూకు దెబ్బ ఎంత తీవ్రంగా ఉంటుందో తెలిసి రాగానే.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గుర్రుమన్నారు. రాష్ట్రప్రభుత్వానికి చాలా నష్టం వచ్చేస్తున్నదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. కానీ.. ఒకసారి ఢిల్లీ వెళ్లి ప్రధాని మోదీని కలిసి రాగానే పరిస్థితి మొత్తం మారిపోయి, కేంద్ర నిర్ణయానికి వంత పాడడం ప్రారంభించారు. ఎటూ కేంద్ర నిర్ణయం అనేది అవినీతిని అంతమొందించడానికి, నల్లధనాన్ని కట్టడి చేయడానికి ఉద్దేశించినదే గనుక.. కేసీఆర్ మారిన వ్యవహార సరళి గురించి పెద్దగా చర్చ లేకుండానే గడచిపోయింది.

అయితే ఇప్పుడు ఉద్యమ నాయకుడు అయిన కేసీఆర్ ఇప్పుడు కేంద్రం మీద పిడుగులు కురిపిస్తున్నారు. నల్లధనం బయటకు తీసుకువచ్చే పేరిట మోదీ సర్కారు బంగారం జోలికి వస్తే మాత్రం సహించేది లేదని, తెలంగాణ ఉద్యమం తరహాలో మరో భారీ ఉద్యమానికి శ్రీకారం చుడతానని ఆయన అంటున్నారు. అసెంబ్లీలో శాసనమండలిలో నోట్ల రద్దు పర్యవసానాల గురించిన చర్చలో కేసీఆర్ ఈ రకమైన స్పష్టత ఇవ్వడం గమనార్హం.

అయితే ఇటీవలి కాలంలో... ప్రధానంగా నోట్ల రద్దు తదనంతర పరిణామాలు.. కేసీఆర్ ను ప్రత్యేకంగా దిల్లీకి పిలిపించుకుని మోదీ సలహాలు స్వీకరించిన నేపథ్యం.. ఆ తర్వాతి కాలంలో మోదీ చర్యలకు జై కొడుతూ కేసీఆర్ సాగిస్తున్న ప్రస్థానం ఇవన్నీ చూస్తే.. ‘మరో పోరాటం చేస్తా’ అన్న బెదిరింపులు నిజమైనవేనా? అనే అనుమానం పలువురికి కలుగుతోంది. బంగారం జోలికి కూడా మోదీ సర్కారు వస్తున్న వ్యవహారం ప్రజల్లో విపరీతమైన వ్యతిరేకతకు దారి తీసిన నేపథ్యంలో.. ఆ చర్యలను సమర్థించడానికి చాలా ఎన్డీయే భాగస్వామ్య పార్టీలు కూడా వెనుకాడాయి. మహిళా ఓటు బ్యాంకు ను దారుణంగా నష్టపోవాల్సి వస్తుందని ఆందోళన చెందాయి. తెలుగుదేశం నాయకులు కూడా.. కేంద్రాన్ని ఈ విషయంలో హెచ్చరించడం జరిగింది. ఇలాంటి నేపథ్యంలో శాసనసభలో అదే టాపిక్ వచ్చినప్పుడు కేసీఆర్ కేంద్రం మీద వ్యక్తం చేస్తున్న ఆగ్రహావేశాలు ఉత్తుత్తివే అనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

సొంత కూటమి పార్టీల్లో వ్యతిరేకత ఎలా ఉన్నా సరే.. మోదీ సర్కారు బంగారం జోలికి రాకుండా ఉంటుందనుకోవడం భ్రమ. కాకపోతే.. ఛానెళ్ల పుణ్యమాని ప్రజలు భయపడుతున్నట్లుగా కాకుండా.. కొంతవరకు మాత్రమే దాని తీవ్రత ఉంటుంది. 8వ తేదీ తర్వాత జరిగిన భారీ కొనుగోళ్ల మీద మాత్రమే గట్టిగా దృష్టిపెట్టే అవకాశం ఉంటుంది. ఆ లెక్కన కూడా చాలా మంది ఐటీ ఉచ్చుకు చిక్కు ప్రమాదం ఉంది. అదేమీ చిన్న పరిణామం కాదు. మరి దానిపై కూడా కేసీఆర్ పోరాటం చేస్తారా? లేదా వేచిచూడాలి.

Similar News