మోదీ సర్కారుపై చంద్రబాబు అలిగిన వేళ...

Update: 2016-11-29 19:10 GMT

ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు గారు అలిగారు. నోట్ల రద్దు విషయంలో ప్రజల కష్టాలు తీర్చడానికి, ప్రజల దృష్టిలో చెడ్డపేరు రాకుండా ఉండడానికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు కేంద్రం సహకరించడంలేదనే ఉద్దేశంతో ఉన్న చంద్రబాబునాయుడు... కాస్త అలక పూనినట్లుగా సమాచారం. ప్రజల కష్టాల నివారణకు కేంద్రం నియమించిన అయిదుగురు సీఎంల కమిటీ విషయంలో .. ఆ కమిటీ తొలి సమావేశం షెడ్యూలు గురించి విలేకరులు అడిగినప్పుడు చంద్రబాబునాయుడు స్పందించిన తీరు.. చేసిన వ్యాఖ్యలు గమనించిన ఎవరికైనా సరే.. ఆయన కేంద్రం మీద అలిగారనే అభిప్రాయాన్నే కలిగించేలా ఉన్నాయి.

ముఖ్యమంత్రుల కమిటీ ఏర్పాటుచేసిన తర్వాత.. డిసెంబరు మొదటి వారంలో ఈ కమిటీ సమావేశాన్ని ఢిల్లీలో ఏర్పాటు చేసినట్లుగా వార్తలు వచ్చాయి. అయితే మంగళవారం రాత్రి చంద్రబాబు ప్రెస్‌మీట్ నిర్వహించినప్పుడు.. విలేకరులు ఈ భేటీ గురించి ఆయనను ప్రశ్నించారు.

అయితే ఢిల్లీలో తొలి భేటీకి సంబంధించి తనకేమీ సమాచారం లేదని చంద్రబాబునాయుడు వెల్లడించారు. అరుణ్ జైట్లీ గారు ఫోన్ చేసి.. ఇలాంటి కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లుగా తనతో చెప్పారని, ప్రజల ఇబ్బందులు చెప్పకుండా దానికి నేతృత్వం వహించలేనని తాను చెప్పానని.. అంతేనని.. ‘ఆ తర్వాత నాకు ఎలాంటి సమాచారం లేదు, ఫోను రాలేదు’ చంద్రబాబునాయుడు చెప్పారు.

సోమవారం జైట్లీ ఫోను చేసినప్పుడు చంద్రబాబునాయుడు ఆవేశంగా స్పందించిన తీరును బట్టి.. అసలు ముఖ్యమంత్రులు కమిటీలో ఆయన పేరును పక్కన పెట్టారా అనే అనుమానాలు కూడా రేగుతున్నాయి. అదే సమయంలో అసలు చంద్రబాబునాయుడు ఆ కమిటీ నేతృత్వానికి ఒప్పుకోవడం మీద బాబు కేబినెట్ సహచరుల్లోనే భిన్నాభిప్రాయాలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర అవసరాలకు విన్నవించినప్పుడు కేంద్రం సరిగా స్పందించలేదనే అభిప్రాయం వారిలో ఉంది. ఈ నేపథ్యంలో అసలు కమిటీ వ్యవహారమే డోలాయమానంగా మారగా.. చంద్రబాబునాయుడు కేంద్రం వైఖరిపై అలక వహించారని అంతా అనుకుంటున్నారు.

Similar News