మోదీ రమ్మన్నారు : రేపు ఢిల్లీకి కేసీఆర్!

Update: 2016-11-17 13:15 GMT

నోట్ల రద్దు వలన రాష్ట్ర ప్రభుత్వానికి ఎదురవుతున్న కష్టాలను కేంద్రం దృఫ్టికి తీసుకు వెళ్లడానికి, పరిస్థితిని చక్కదిద్దుకోవడానికి తెలంగాణ సీఎం కేసీఆర్ అలుపెరగని ప్రయత్నం చేస్తున్నారు. రాబడి పరంగా తెలంగాణ సర్కారుకు ఎంత నష్టం వాటిల్లిందో వివరిస్తూ కేంద్రానికి లేఖలు రాయించిన కేసీఆర్ గురువారం ఏకంగా ప్రధానికి మోదీకి ఫోనుచేసి మాట్లాడారు. రాష్ట్రంలో ఏర్పడిన ఆర్థిక ఆత్యయిక పరిస్థితిని ఆయన ప్రధానికి వివరించినట్లు తెలుస్తోంది. పరిణామాల గురించి మాట్లాడడానికి రేపు దిల్లీలో అందుబాటులో ఉండాలని మోదీ కోరడంతో కేసీఆర్ బయల్దేరి ఢిల్లీ వెళుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.

పెద్దనోట్ల రద్దు వ్యవహారంతో ఒక్కసారిగా ప్రభుత్వ రాబడులు దారుణంగా పడిపోయాయని కేసీఆర్ సర్కారు కొన్నిరోజులుగా ఆందోళన వ్యక్తం చేస్తూనే ఉంది. దీనిపై రకరకాల సమీక్షలు , ఉన్నతాధికార్లతో మేధో మధనాలు నిర్వహిస్తున్నారు. ఒకవైపు ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వడానికి కూడా డబ్బుల్లేవని ఈ నెలలో అందరికీ సగం సగం జీతాలు మాత్రమే ఇస్తారని కూడా ఒక ప్రచారం జరుగుతోంది. ఇలాంటి నేపథ్యంలో రాష్ట్రానికి జరుగుతున్న నష్టాన్ని కేంద్రమే భర్తీ చేయాలనే డిమాండ్ ను కేసీఆర్ లేవనెత్తుతున్నారు. ఈ విషయమై మాట్లాడుతూ.. అన్ని విషయాలనూ ప్రధాని మోదీకి వివరిస్తానని కేసీఆర్ చెబుతున్నారు. రాష్ట్రాలు కేంద్రానికి చెల్లించాల్సిన అప్పులను వాయిదా వేయాలని కేసీఆర్ డిమాండ్ చేస్తున్నారు.

అనూహ్యమైన కష్టాల కోణంలో సీఎం కేసీఆర్ ఈ అంశాన్ని భుజానికెత్తుకున్న తర్వాత.. ఆయనకు దేశంలోని మరి కొన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఫోను చేసి.. తమ తమ రాష్ట్రాల్లో ఉన్న ఇలాంటి రాబడి ఇబ్బందులను చర్చించినట్లుగా కూడా వార్తలు వచ్చాయి. మొత్తానికి ఈ విషయంలో కేసీఆర్ పలు రాష్ట్రాల ముఖ్య మంత్రుల ఏకాభిప్రాయాన్ని కూడా సాధించారు. దానినే ఆయన ఇవాళ ప్రధాని నరేంద్ర మోదీ దృష్టికి తీసుకువెళ్లారు. దాంతో స్పందించిన మోదీ ఈ విషయమై సాకల్యంగా మాట్లాడేందుకు కేసీఆర్ ను ఢిల్లీ రమ్మన్నారు. మరి కేసీఆర్ తన డిమాండుతో ఎలాంటి విజయం సాధిస్తారో చూడాలి.

Similar News