మోడీపై ఆజం వెటకారాలు

Update: 2016-10-19 00:34 GMT

తాను ప్రధాని అయితే దేశ ప్రజలందరి అకౌంట్లలో ఆరు లక్షల రూపాయల వంతున డిపాజిట్ చేస్తానని ప్రకటించిన మోడీ.. అధికారంలోకి రావడానికి బహుశా అదొక్కటే కారణం కాకపోవచ్చు. కానీ.. ఆ రూపేణా ఆయన చేసిన ప్రకటన, ఇచ్చిన హామీ మాత్రం.. ఇవాళ్టి వరకు కూడా విపక్షాలకు అస్త్రంగానే ఉపయోగపడుతోంది. ప్రజల అకౌంట్లలోకి డబ్బులు వేయడం సంగతి తరువాత.. కనీసం మోదీ సర్కారు విదేశాల్లో ఉన్న నల్లధనం వివరాలు అయినా రాబట్టడానికి ప్రయత్నిస్తున్నదా? ఈ రెండున్నరేళ్లలో ఆ దిశగా ఏం పురోగతి సాధించారు? అని విపక్షాలు ఆడిపోసుకుంటున్నాయి.

అయితే వివాదాస్పద ప్రకటనలు చేస్తూ వార్తల్లో వ్యక్తిగా నిలవడంలో తనకంటూ ఒక మార్కు ఉన్న సమాజ్ వాదీ పార్టీ సీనియర్ నాయకుడు ఆజం ఖాన్.. మోదీ మీద తీవ్రస్థాయిలో వెటకారాలు చేశారు. నాకు టీ పెట్టడం వచ్చు, చక్కగా దుస్తులు వేసుకుంటాను. నేను గనుక ప్రధాని అయితే దేశంలోని 130 కోట్ల మంది అకౌంట్లలో ఒక్కొక్కరికి 20 లక్షల రూపాయల వంతున వేసేస్తాను అంటూ ఆజం ఖాన్ మోదీ తీరును వెటకారం చేస్తున్నారు.

యూపీలో ఎన్నికల వేడి నానాటికి రాజుకుంటున్నది. ప్రస్తుతం అక్కడ ఎస్పీ ఏలుబడి నడుస్తూ ఉండగా.. అధికారం చేజిక్కించుకోవడానికి భాజపా తాపత్రయ పడుతున్నది. ఇలాంటి సమయంలో ఆజం ఖాన్ విమర్శలు ప్రముఖంగా వార్తల్లోకి వస్తున్నాయి.

ఆజం లాంటి నాయకుల వ్యాఖ్యలను ప్రజలు సీరియస్ గా పట్టించుకోకపోవచ్చు. కానీ ఇలాంటి వెటకారాల సమయంలో మోదీ అన్నమాట నిలబెట్టుకోలేకపోయారన్న వాస్తవం కూడా ప్రజలకు గుర్తుకు వస్తుంది. మోదీకి ఉండే క్రెడిబిలిటీని అది ఖచ్చితంగా దెబ్బతీస్తుంది అని పలువురు భావిస్తున్నారు.

Similar News