మోడీ ఇలా ఎందుకు చేశారు....?

Update: 2017-11-06 16:30 GMT

ప్రధాని నరేంద్ర మోడీ ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటారో పార్టీ నేతలకూ తెలియదు. సోమవారం చెన్నై వచ్చిన ప్రధాని మోడీ నేరుగా డీఎంకే అధినేత కరుణానిధి ఇంటికి వెళ్లడం చర్చనీయాంశమైంది. కరుణానిధి గత కొంతకాలంగా అనారోగ్యంతో ఉన్నారు. ఆయనను పరామర్శించేందుకే ప్రధాని వచ్చారని డీఎంకే నేతలు చెబుతున్నప్పటికీ తమిళనాడులో ఏదో జరుగుతుందన్న ఊహాగానాలు పొలిటికల్ పార్టీలో బయలుదేరాయి. వాస్తవానికి సోమవారం చైన్నైలోని తమిళ దినపత్రిక దినతంత్రి ప్లాటినం జూబ్లీ వేడుకల్లో పాల్గొనేందుకు ప్రధాని మోడీ చెన్నై వచ్చారు. ఇది ముందుగా ఖరారైన కార్యక్రమమే. కరుణానిధి పరామర్శ విషయం చివరినిమిషం వరకూ అధికారులకు కూడా తెలియదు. అయితే మోడీ అకస్మాత్తుగా కరుణానిధి ఇంటికి వెళ్లి ఆయనను పరామర్శించి దాదాపు అరగంటసేపు మంతనాలు సాగించడం హాట్ టాపిక్ గా మారింది.

కేవలం పరామర్శేనా....?

ప్రధాని మోడీ కరుణానిధి పరామర్శ విషయం రాష్ట్ర బీజేపీ నేతలకూ తెలియదట. కేవలం ఆ పార్టీ జాతీయ కార్యదర్శి మురళీధరరావుకు మాత్రమే సమచారం ఉంది. అయితే డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ స్టాలిన్ ఆహ్వానం మేరకే మోడీ ఆయన ఇంటికి వెళ్లారని తర్వాత బీజేపీ నేతలు సర్దిచెప్పుకుంటున్నారు. తమిళనాడులో జయలలిత మరణం తర్వాత అన్నాడీఎంకే ముక్కలయింది. శశికళ ఒకవర్గంగానూ, పన్నీర్, పళనిస్వామిలు మరో వర్గంగానూ ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీ పరిస్థితి కష్టమే. లోక్ సభ ఎన్నికల నాటికి కమల్ పార్టీ కూడా రంగంలో ఉండే అవకాశముంది. ఈ నేపథ్యంలోనే మోడీ కరుణానిధిని పరామర్శించడం డీఎంకేను దగ్గర చేసుకోవడానికేనా? అన్న అనుమానం అన్నాడీఎంకే నేతల్లోనూ బయలుదేరింది. అయితే డీఎంకే నేతలు స్టాలిన్, కనిమొళిలు మాత్రం ఇది కేవలం పరామర్శ మాత్రమేనని, ఇందులో రాజకీయ కోణం ఏమీ లేదని చెప్పారు. మొత్తం మీద చెన్నై మోడీపర్యటన అనేక పార్టీలో కలకలం రేపింది.

Similar News