ముద్రగడ హౌస్ అరెస్ట్

Update: 2017-01-24 12:02 GMT

కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభాన్ని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. కిర్లంపూడి నుంచి రావుల పాలెం వెళ్లేందుకు బయటకు వచ్చిన ముద్రగడను అరెస్ట్ చేస్తున్నట్లు పోలీసులు ప్రకటించారు. దీంతో ముద్రగడ పద్మనాభం పాదయాత్ర కు మళ్లీ బ్రేక్ పడింది.

బుధవారం నుంచి ముద్రగడ పద్మనాభం కాపులకు రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ పాదయాత్ర చేస్తానని ప్రకటించారు. రావుల పాలెం నుంచి అంతర్వేది వరకూ పాదయాత్ర కొనసాగుతుందని చెప్పారు. కాపు జేఏసీ కూడా ముద్రగడ పాదయాత్రలో పాల్గొననుంది. కాని పోలీసులు అనుమతి లేదన్నకారణంగా ముద్రగడను హౌస్ అరెస్ట్ చేశారు. తాను గాంధేయ మార్గంలో పాదయాత్ర చేస్తున్నప్పుడు పోలీసుల అనుమతి ఎందుకు తీసుకోవాలని ముద్రగడ ప్రశ్నించారు. అలాగే కోనసీమలో కాపు జేఏసీ నేతలను పోలీసులు ముందస్తు అరెస్ట్ లు చేశారు. దీనిపై ముద్రగడ స్పందించారు. అధికారం ఉంది కదా అని ఉద్యమాన్ని ఉక్కుపాదంతో అణిచివేయాలని ప్రభుత్వం చూస్తోందని ముద్రగడ హౌస్ అరెస్ట్ అయిన తర్వాత ఆరోపించారు. పోలీసులు తమను అసభ్య పదజాలంతో దూషిస్తున్నా...జాతి కోసం..తమ పిల్లల భవిష్యత్ కోసం భరిస్తున్నామన్నారు. అయితే బంతిని ఎంతగా కిందకు కొడితే ...అంతగా పైకి లేస్తుందన్న విషయాన్ని ప్రభుత్వం గుర్తించాలన్నారు. తమ నేతలతో మాట్లాడి భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తామన్నారు ముద్రగడ. దీంతో కోనసీమలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

Similar News