ముచ్చటైన ఆటతో సరికొత్త హీరో హసీబ్ హమీద్!

Update: 2016-11-13 04:15 GMT

రాజ్‌కోట్ లో చారిత్రాత్మక టెస్ట్ మ్యాచ్‌కు రంగం సిద్ధం అయింది. మ్యాచ్ నిర్వహణకు సంబంధించి బీసీసీఐకు ఉన్న కష్టాలుకూడా ముందురోజు తొలగిపోయాయి. టాస్ ఇంగ్లాండ్‌కు అనుకూలంగా పడింది. ఓపెనర్లు బరిలోకి వచ్చారు. ఇప్పటిదాకా క్రికెట్ ప్రేక్షక ప్రపంచం చూసి ఎరగని.. ఇంకా నూనూగు మీసాలు కూడా రాని ఓ 19 ఏళ్ల కుర్రాడు బెరుకు బెరుగ్గా.. అదే సమయంలో కాన్ఫిడెంట్ గా క్రీజులోకి అడుగుపెట్టాడు. అతని పేరు హసీబ్ హమీద్!

ఇంగ్లాండుకు కొత్త ఓపెనర్‌గా తలపడడానికి వచ్చిన ఆ కుర్రాడు హసీబ్ హమీద్. అతని వయసుస 19 సంవత్సరాల 253 రోజులు. హెల్మెట్ లో తెలియడం లేదు గానీ.. కుర్రాడు బక్కపలచగా, చాలా లేతగా ఉన్నాడు. ఇటువైపు ప్రత్యర్థి భారత్ అంటే చిన్న సంగతి కాదు. టెస్టు క్రికెట్ లో ప్రపంచ నెంబర్ వన్ జట్టు.

ప్రపంచ నెంబర్ వన్ జట్టును వారి స్వదేశంలో వారికి అలవాటైన పిచ్ ల మీద ఎదుర్కోవడానికి, దిగ్గజాలు, హేమాహేమీలు అనుకునే బౌలర్ల దాడిని తట్టుకోవడానికి కెరీర్ లో తొలిటెస్టు ఆడుతున్న ఆ పసివాడు ఎంతగా కంగారు పడుతూ ఉంటాడో నని అందరూ ఊహించవచ్చు. గ్యాలరీల్లో బ్రిటన్ నుంచి వచ్చిన అతని కుటుంబసభ్యులందరూ ఉన్నారు. వారంతా తమ ఇంటి బిడ్డ ఎలాంటి ప్రదర్శన చేస్తాడో అని ఎదురుచూస్తున్నారు. అలాంటి నేపథ్యంలో చాలా భయాలతోనే బరిలోకి దిగాడు హసీబ్ హమీద్.

భారత బౌలర్లు ఎంతో అనుభవజ్ఞులు. కానీ వారిని ఎదుర్కొంటున్నాననే వెరపు అతనిలో ఎంతమాత్రం లేదు. ఒకసారి బ్యాటింగ్ మొదలు కాగానే.. అన్ని భయాలు, సంకోచాలు పటాపంచాలు అయిపోయినట్లున్నాయి. ఎలాంటి తడబాటు లేకుండా చక్కటి ప్రదర్శనను ప్రారంభించాడు ఆ కుర్రాడు.

భయం లేదు. అలాగని దూకుడు లేదు. ఎంతో అనుభవజ్ఞుడైన ఆటగాడిలాగా, ఒక్కొక్క బౌలరును అప్పటికే ఎన్నో మ్యాచ్ లలో ఎదుర్కొన్న అనుభవం ఉన్నట్లుగా ఎదుర్కొనడం ప్రారంభించాడు. క్రికెట్ పుస్తకాల్లో వర్ణించినట్లుగా చక్కటి డిఫెన్స్ షాట్ లు, అవకాశం వచ్చినప్పుడు సింగిల్స్ తీస్తూ.. టెస్ట్ క్రికెట్ కు అచ్చంగా సూటయ్యే కుర్రాడిలాగా ఆట ప్రారంభించాడు. అతని జీవితంలో తొలి ఇన్నింగ్స్ నెంబర్ వన్ ప్రత్యర్థిపై అలా మొదలైంది. 37 పరుగులు చేసి అవుటయ్యాడు.

రెండో ఇన్నింగ్స్ లో రంగ ప్రవేశం చేసేసరికి హమీద్ రాటుదేలిపోయాడు. భారతీయ ప్రేక్షకులు కూడా ముచ్చట పడే స్థాయిలో అందమైన ఆట ఆడుతూ అలరించాడు. నాలుగోరోజు ఆట ముగిసే సమయానికి 116 బంతులు ఎదుర్కొని 62 పరుగులు చేశాడు. టెస్ట్ జీవితంలో అడుగుపెట్టిన తొలి మ్యాచ్ లోనే హమీద్ కు హాఫ్ సెంచరీ. అతను నింపాదిగా ఆడుతున్న తీరును గమనిస్తే.. అయిదో రోజు డ్రా దిశగా సాగుతున్న ఆటలో మరింత నింపాదిగా ప్రదర్శన చేసి.. ఆ కుర్రాడు సెంచరీ చేసినా ఆశ్చర్యం లేదని, తొలి టెస్టులోనే సెంచరీ చేసిన ఘనతను సాధించవచ్చునని అనిపిస్తోంది. హమీద్ అంత ముచ్చటైన ఆటతో ప్రేక్షకులను, క్రీడాభిమానులను ఆకట్టుకుంటున్నాడు. ఇంత పసి వయసులోని కుర్రాడు హమీద్ రూపంలో.. ఇంగ్లాండ్ క్రికెట్ జట్టుకు ఇక సుదీర్ఘకాలం పాటు సేవలు అందించగల చక్కటి ఓపెనర్ లభించాడని భావించవచ్చు.

కెరీర్ తొలి టెస్టులోనే హాఫ్ సెంచరీ చేసిన ఇంగ్లాండ్ ఓపెనర్, 19 ఏళ్ల వయసులోనే అంతర్జాతీయ క్రికెట్ లో తన అధ్యాయాన్ని ప్రారంభించబోతున్న హసీబ్ హమీద్ కు తెలుగుపోస్ట్ శుభాకాంక్షలు.

Similar News