మిసెస్ బాలయ్య భక్తి : చెల్లని నోట్లు వెంకన్నకు !

Update: 2016-12-04 02:21 GMT

మనం చిన్నపిల్లలకు అన్నం తినిపిస్తూ ఓ కథ చెబుతాం.. ’’అనగనగా.. పప్పు, అన్నం, నెయ్యి, కూర, పెరుగు, పచ్చడి.. అన్నీ కలిపి నీకో ముద్ద, నాకో ముద్ద, నాన్నకో ముద్ద, అన్నకో ముద్ద, నానమ్మకో ముద్ద.. అంటూ సాగే కథ.. చివరగా.. అంతా అయిపోయాక అడుగున మిగిలిందంతా గోకి.. బిచ్చమెత్తే సాములోరికి వేసేసి.. ఇక కొండకు పోయే దారేది..’’ అంటూ కథ సాగుతుంది. ఇప్పుడు చెల్లని నోట్లు ఇబ్బడి ముబ్బడిగా ఉన్న వారు కూడా ఇదే కథను ఫాలో అవుతున్నట్లున్నారు.

చెల్లని నోట్లు భారీగా ఉన్నవాళ్లు బ్యాంకుల ద్వారాను, తెలిసిన వాల్ల ద్వారాను, దళారీల ద్వారాను మార్చుకున్నవి మార్చుకోగా.. మిగిలిన చెత్తలాంటి చెల్లని నోట్లను.. ఏకంగా తీసుకొచ్చి తిరుమల స్వామివారికి హుండీలో సమర్పించుకుంటున్నారు. ఇలాంటి భక్తిపూర్వకమైన ఆలోచనతో నందమూరి బాలకృష్ణ సతీమణి కూడా ఓ పదిలక్షల రూపాయల చెల్లని నోట్లను తిరుమల వెంకన్న వారికి సమర్పించుకోవడానికి తీసుకువెళ్లారు. మీమీ బ్యాంకు ఖాతాల్లో వేసుకుని, పరిమితి మించి ఉంటే దానికి పన్ను చెల్లించాల్సి ఉంటుందని ప్రభుత్వం ప్రకటించిన పాత రూపాయల నోట్లతో ఆమె తిరుమలకు వెళుతూ.. రేణిగుంట విమానాశ్రయంలో తనిఖీ అధికారుల కళ్ల బడడం గమనార్హం.

అయితే ఆదాయపు పన్ను శాఖ వారు ఇచ్చిన ధ్రువీకరణ పత్రాలను కూడా ఆమె తనిఖీ అధికారులకు చూపించి, వివాదంగా మారకుండా బయటపడ్డారు. అయినా ఆదాయపు పన్ను శాఖ వారి ధ్రువీకరణ కూడా ఉన్న తరువాత.. ఆ నోట్లను కొత్తనోట్లుగా మార్పిడి చేయించి.. వెంకన్నకు సమర్పించి ఉంటే ఎంతో బాగుండేది కదా.. ఇప్పుడు చెల్లని నోట్లను స్వామి హుండీలో పడేయడం కిందికి వస్తుంది కదా అంటూ జనం దీని గురించి వ్యాఖ్యానించుకుంటున్నారు.

Similar News