మార్గదర్శకుడి చేరువలోనే.. శాశ్వత విశ్రాంతిలోకి ‘అమ్మ’!

Update: 2016-12-06 11:48 GMT

తమిళ జాతి యావత్తూ అమ్మ పురట్చితలైవి జయలలితకు అశ్రునయనాలతో అంతిమ వీడుకోలు పలికింది. దేశంలో ఎక్కడెక్కడినుంచో రాజకీయ సినీ ప్రముఖులు ఎందరో జయలలిత పార్దివ దేహానికి శ్రద్ధాంజలి ఘటించడానికి చెన్నయ్ కు వచ్చారు. ‘అమ్మ’ను చివరి చూపు చూసేందుకు తమిళనాడు ప్రజలు లక్ష్ల సంఖ్యలో చెన్నయ్ లోని రాజాజీ భవన్ వద్దకు వచ్చారు.

మొత్తానికి జయలలిత.. తన రాజకీయ మార్గదర్శకుడు, స్నేహితుడు, హితుడు తనకు సకలం అయిన ఎంజీ రామచంద్రన్ సమాధికి కేవలం 20 అడుగుల దూరంలోనే మెరీనా బీచ్ లో శాశ్వత విశ్రాంతిలోకి జారుకున్నారు. అక్కడే చందనపు పెట్టెలో ఉంచిన ఆమె పార్థివదేహాన్ని సమాధి చేశారు. ఆ చందనపు పెట్టె మీద ‘పురట్చి తలైవి జయలలిత’ అనే అక్షరాలు చెక్కించారు. నెచ్చెలి శశికళ నే ఆమె పార్థివ దేహానికి అంతిమ సంస్కారాలు నిర్వహించారు. కేంద్రప్రభుత్వ అధికారిక లాంఛనాలతో ఆమె అంత్యక్రియలు పూర్తయ్యాయి.

==

అపోలో ఆస్పత్రి నుంచి పోయెస్ గార్డెన్ లోని నివాసానికి తీసుకువచ్చిన తర్వాత.. శాస్త్రోక్తమైన కొన్ని కార్యక్రమాలు నిర్వహించిన తర్వాత.. నగరంలోని రాజాజీ భవన్‌కు ప్రజల సందర్శనార్థం తరలించారు. దేశంలోని ప్రముఖులందరూ అక్కడికే వచ్చి ఆమెకు నివాళి అర్పించారు. ప్రయాణిస్తున్న విమానంలో లోపం వల్ల ఒకసారి వెనక్కు వెళ్లిన రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, మళ్లీ మరో విమానంలో వచ్చారు. అంతకుముందే ప్రధాని మోదీ, కేంద్రంలోని ప్రముఖులు రావడం జరిగింది. కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ కూడా వచ్చారు. ఏపీ సీఎం చంద్రబాబునాయుడు స్వయంగా వెళ్లగా, తెలంగాణ ప్రభుత్వం తరఫున మంత్రులు హరీష్ రావు, నాయని నర్సింహారెడ్డి హాజరయ్యారు. భారతీయ చలనచిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులు అనేక మంది వచ్చి ఆమెకు కడసారి వీడ్కోలు పలికారు.

ఎంజీఆర్ ప్రేరణతోనే రాజకీయాల్లోకి అడుగుపెట్టి... పార్టీ మీద ఆధిపత్యం విషయంలో ఆయన వారసత్వాన్ని పుణికి పుచ్చుకుని.. తిరుగులేని నాయకురాలిగా ఎదిగిన జయలలిత.. అదే ఎంజీఆర్ సమాధికి సమీపంలోనే సమాధి కావడం విశేషం.

Similar News