మమతా దీదీ పోరాటానికి ఫలితం ఉంటుందా?

Update: 2016-11-13 14:57 GMT

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఒక తొందరపాటు ప్రకటన చేసేశారు. తాను పోరాటాన్ని లీడ్ చేస్తానంటూ గట్టిగా ఒక ప్రకటన చేశారు. కానీ అది వాస్తవంగా.. ఎలాంటి ఫలితం రాబట్టలేని నిష్ఫలమైన పోరాటం. ప్రజల్లో మెజారిటీనుంచి తన వాదనకు మద్దతు లేకుండా,‘‘ప్రజల తరఫున, ప్రజల కోసం‘’ అనే ట్యాగ్ లైన్ లతో ఉద్యమం చేస్తే గనుక దాని వల్ల ఉపయోగం ఉండదని మమతా బెనర్జీ తెలుసుకోవాల్సి వస్తుందేమో.

ఇంతకూ వివరాల్లోకి వెళితే.. మోదీ తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని మమతా దీదీ తొలినుంచి తప్పు పడుతున్న సంగతి తెలిసిందే. ఆమెకు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కూడా తోడయ్యాడు. ఆమె వాదనకు ఆయన జై కొట్టడం, ఆయన చేసే మోదీపై విమర్శలకు మమతా దీదీ జైకొట్టడం జరుగుతోంది. అయితే వచ్చే సార్వత్రిక ఎన్నికల సమయానికి మోదీకి వ్యతిరేకంగా చిన్న పార్టీలు అనేకం అన్నిటినీ కూడగట్టి తను సారథ్యం వహించాలని కల గంటున్న మమతా దీదీ ... ఈ పెద్ద నోట్ల రద్దు వ్యవహారాన్ని ఆ ప్రయత్నానికి ప్రాథమికమైన భూమికగా వాడుకోదలచినట్లుగా కనిపిస్తోంది. నోట్ల రద్దు నిర్ణయాన్న సస్పెండ్ చేయాలని, సామాన్యులకు ఇబ్బంది లేకుండా పెద్ద నోట్ల చెలామణీని యథాతథంగా కొనసాగించాలని మమతాదీదీ కోరుతున్నారు. దీనికి ప్రజలు కూడా ఎంత మేరకు సుముఖంగా ఉన్నారో లేదా.. ఆమె ఉద్యమ పట్టాలెక్కేలోగా జనం తమ నోట్ల కష్టాల నుంచి బయటపడతారో తెలియదు గానీ.. ఈ డిమాండుతో అనేక పార్టీలను కూడగడుతున్నట్లు మమతా దీదీ చెబుతున్నారు.

వీరంతా కలిసి మమతా సారథ్యంలో రాష్ట్రపతిని కలిసి.. ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని వెనక్కు తీసుకునేలా ఆదేశించాలని కోరుతారట. రాష్ట్రపతి వద్ద ఫిర్యాదు సంగతి తర్వాత.. ఆ మిష మీద.. అన్ని పార్టీలను కూడగట్టడం, దీదీ సారథ్యం వహించడం మాత్రం ఖరారుగా జరుగుతుంది. ఇప్పటికే జనం చేతిలోకి కొత్త రకం నోట్లు వచ్చేసి చెలామణీలోకి వెళ్లిపోయిన నేపథ్యంలో.. వారి డిమాండుకు కాలదోషం పట్టినట్లే. పోరాటం నిష్ఫలమే అవుతుంది గానీ.. పార్టీలని కూడగట్టడం మాత్రం కుదురుతుందని అనిపిస్తోంది. అంటే మమతాదీదీకి వ్రతం సక్సెస్ అవుతుంది గానీ.. ఫలం దక్కదన్నమాట.

Similar News