మట్టి తీయకుండానే ఆరు కోట్లు కొట్టేశారు...

Update: 2017-02-02 03:50 GMT

జాతీయ ఉపాధి హామీ పనులు రైతులకేమో గాని.. అధికారులకు మాత్రం కాసులు కురిపిస్తున్నాయి. తవ్విన చోటే తవ్వినట్లుగా చూపిస్తూ..అధికారులు కోట్లాది రూపాయలు కైంకర్యం చేస్తున్నారు. ఒక్క ఆదిలాబాద్ జిల్లాలో ఉపాధి హామీ పధకంలో ఆరు కోట్ల రూపాయల మేరకు అవినీతి జరిగినట్లు వెల్లడయింది. దీంతో ముఖ్యమంత్రి కేసీఆర్ సైతం ఆశ్చర్యం వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో తనిఖీలు చేయాలని అధికారులను ఆదేశించారు. కూలీల కడుపునింపేందుకు ప్రవేశపెట్టిన ఈ పథకం ఉద్యోగులకు వరంగా మారింది.

నకిల జాబ్ కార్డులు సృష్టించి....

తెలంగాణ రాష్ట్రం ఆదిలాబాద్ జిల్లాలో మొత్తం 60 కోట్లతో జాతీయ ఉపాధి హామీ పథకం కింద పనులు చేపట్టారు. ఇందుకు 11,440 పనులున్నట్లు గుర్తించారు. జిల్లాలో మొత్తం ఈ పధకం కింద మూడు లక్షల జాబ్ కార్డులను కూలీలకు, రైతులకు ఇచ్చారు. వారితో ఈ పనులు చేయించి వారికి రోజువారీ కూలీ ఇవ్వాల్సి ఉంది. మూడు లక్షల మందిలో కేవలం రెండు లక్షల మంది మాత్రమే పనులకు హాజరవుతున్నారని లెక్కలు చెబుతున్నారు. తవ్విన కాల్వలనే మళ్లీ తవ్వినట్లు రికార్డుల్లో చూపిస్తున్నారు. ఈ విషయం సామాజిక తనిఖీలో వెల్లడయింది. టెక్నికల్ అసిస్టెంట్లు, ఫీల్డ్ అసిస్టెంట్లు కుమ్మక్కై చేసిన పనినే మళ్లీ చేయిస్తున్నామని కాగితాల్లో చూపుతూ కోట్ల రూపాయలను కాజేశారు. దీనిపై ప్రభుత్వానికి నివేదిక అందడంతో చర్యలు చేపట్టింది. అవినీతికి పాల్పడిన అధికారుల నుంచి 1.2 కోట్లను రికవరీ చేయగలిగింది. మొత్తం 24 మంది ఫీల్డ్ అసిస్టెంట్లను, 23 మంది టెక్నికల్ అసిస్టెంట్లను, ముగ్గురు కంప్యూటర్ ఆపరేటర్లను, ఒక ఏపీవోను సస్పెండ్ చేశారు. క్షేత్రస్ధాయిలోపనులు పరిశీలించే 500 మంది తాత్కాలిక ఉద్యోగులనూ తొలగించారు. జిల్లాలోని బోధ్, ఇంద్రవెల్లి, గుడిహత్నూర్, ఇచ్చోడ, ఉట్నూర్, నార్నూర్ మండలాల్లో ఈ అవినీతి జరిగినట్లు ఉన్నతాధికారులు గుర్తించారు. చనిపోయిన వారిపేరుమీద, విద్యార్థుల పేరుమీద జాబ్ కార్డులు సృష్టించి ఈ అవినీతికి పాల్పడ్డారని గుర్తించింది. దీంతో తెలంగాణ సర్కార్ అప్రమత్తమయింది. రాష్ట్రంలోని మిగిలిన జిల్లాల్లో కూడా తనిఖీలు నిర్వహించాలని నిర్ణయించింది.

Similar News