మంచుకొండల్లో నేడు హోరాహోరీ

Update: 2017-11-09 00:30 GMT

హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల్లో నేడు పోలింగ్ జరగనుంది. మొత్తం 68 అసెంబ్లీ స్థానాలకు ఈ ఎన్నికలు జరగనున్నాయి. పోలింగ్ కోసం అన్ని ఏర్పాట్లను ఎన్నికల అధికారులు పూర్తి చేశారు. మొన్నటి వరకూ ఎన్నికల ప్రచారంతో హిమాచల్ ప్రదేశ్ వేడెక్కింది. ప్రధాని నరేంద్ర మోడీ, ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీలు హిమాచల్ లో పోటాపోటీగా ప్రచారం చేశారు. ఈసారి ఎలాగైనా అధికార పక్షాన్ని ఓడించాలన్న కసితో కమలం పార్టీ ఉంది. అలాగే అధికారాన్ని తిరిగి నిలబెట్టుకోవాలని కాంగ్రెస్ పార్టీ తాపత్రయపడుతోంది. హిమాచల్ ప్రదేశ్ లో మొత్తం 49,05,677 మంది ఓటర్లున్నారు. వీరికోసం 7500 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఓటర్లందరికీ ఎన్నికల కమిషన్ ముందుగానే గుర్తింపు కార్డులను జారీ చేసింది. పదమూడోసారి హిమాచల్ ప్రదేశ్ లో ఎన్నికలు జరుగుతున్నాయి.

బీజేపీకే విజయావకాశాలా?

హిమాచల్ ప్రదేశ్ లో కాంగ్రెస్ కాన్ఫిడెన్స్ గా ఉంది. ముఖ్యమంత్రి వీరభద్రసింగ్ నే మరోసారి ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించింది. ఆయనకే అభ్యర్థుల ఎంపిక బాధ్యతలను అప్పగించింది. బీజేపీ కూడా ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించింది. ప్రేమకుమార్ ధుమాల్ తమ సీఎం అభ్యర్థి అని తొలిసారి కమలనాధులు ఎన్నికలకు ముందే ప్రకటించడం ఇక్కడే. హిమాచల్ ప్రదేశ్ లో 38 శాతం క్షత్రియ వర్గ ఓటర్లున్నారు. బ్రాహ్మణ ఓటర్లు 18 శాతం ఉన్నారు. ఈ వర్గాల ఓట్లు ఎవరు కొల్లగొడితే వారిదే విజయమన్నది గత ఎన్నికల ఫలితాలు తేల్చిచెప్పాయి. దీంతో బీజేపీ, కాంగ్రెస్ లు ఈ రెండు వర్గాలను ప్రసన్నం చేసుకునేందుకు అనేక ప్రయత్నాలు చేశాయి. హిమాచల్ ప్రదేశ్ లో రెండు పార్టీలూ గెలుపును సవాల్ గా తీసుకున్నాయి. అయితే ముందస్తు సర్వేల్లో మాత్రం బీజేపీకే ఎక్కువ సీట్లు వస్తాయని తేలింది. ఇక్కడ జీఎస్టీ, నోట్ల రద్దు వంటి విషయాలు పెద్దగా ప్రభావం చూపడం లేదన్నది ఆ సర్వే సారాంశం. మొత్తం మీద హిమాచల్ ప్రదేశ్ లో ఎవరు పీఠం అధిరోహించాలన్నది ఓటర్లు నేడు నిర్ణయించనున్నారు.

Similar News