భూమా బామ్మర్దికి కొత్త టెన్షన్

Update: 2017-11-11 06:30 GMT

టీజీ వెంకటేశ్ కొడుకును బాగా ప్రమోట్ చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో కర్నూలు అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయించాలని టీజీ గట్టిగా భావిస్తున్నారు. అందుకోసమే వారసుడిని రంగంలోకి దించేందుకు ఆయన ఇప్పటికే సామాజికకార్యక్రమాలను ప్రారంభించారు. ఇందుకోసం తన కుమారుడు భరత్ ను వెంట వేసుకుని ప్రతి కార్యక్రమానికి తిరుగుతున్నారు. టీజీ భరత్ కూడా తానే వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానని తన అనుచరులకు కూడా చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుత ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డికి ఇబ్బందిగా మారింది. అయితే తాజాగా జరిగిన సంఘటన టీజీ వెంకటేశ్, ఎస్వీ మోహన్ రెడ్డి ల మధ్య విభేదాలు తీవ్రమయ్యాయ. గత ఎన్నికల్లో టీజీ వెంకటేశ్ కర్నూలు అసెంబ్లీకి టీడీపీ నుంచి పోటీ చేయగా, ఎస్వీ మోహన్ రెడ్డి వైసీపీ నుంచి పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో వైసీపీయే గెలిచింది. అయితే మారిన రాజకీయపరిణామాల నేపథ్యంలో ఎస్వీ మోహన్ రెడ్డి వైసీపీ నుంచి టీడీపీలో చేరారు.

వారసుడికి సీటు కోసం....

అయితే టీజీ వెంకటేశ్ మాత్రం గత ఎన్నికల్లో తాను పోటీచేసి కోట్లు ఖర్చు పెట్టుకున్నానని, తన కుటుంబానికే టిక్కెట్ ఇవ్వాలని గట్టిగా పట్టుబడుతున్నారు. తనకు రాజ్యసభ పదవి ఉంది కాబట్టి తన కుమారుడు భరత్ కు సీటు ఇవ్వాలని చినబాబుకు ముందే దరఖాస్తు పెట్టుకున్నారు. రాజ్యసభ పదవి ఇచ్చే ముందే ఈ డీల్ కుదిరినట్లు తెలుస్తోంది. అయితే ఎస్వీ మోహన్ రెడ్డి వైసీపీ నుంచి వచ్చి చేరడంతో ఆయన కూడా ఈసారి టీడీపీ టిక్కెట్ తనదే నంటున్నారు ఇద్దరి మధ్య గ్యాప్ బాగా పెరిగింది. అయితే నాలుగు రోజుల క్రితం కర్నూలు అర్బన్ నియోజకవర్గంలో ఒక ప్రయివేటు సంస్థ సర్వే చేయించిందట. ఆ సర్వేలో టీడీపీ అభ్యర్థి ఎవరైతే బాగుంటుందని సర్వే చేసిందట. దీంట్లో టీజీ భరత్, ఎస్వీ మోహన్ రెడ్డి పేర్లు ఉండటంతో ఇది టీజీ పనేనని భావించిన ఎస్వీ మోహన్ రెడ్డి ఆ సర్వేపై పోలీసులకు ఫిర్యాదుకూడా చేశారు. టీజీ పై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ఫిర్యాదు చేస్తానని ఎస్వీ తెలిపారు. ఇప్పటికే కర్నూలు జిల్లా టీడీపీ అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లుకు ఎస్వీ ఫిర్యాదు చేశారు. మొత్తం మీద భూమా బామ్మర్దికి టీజీ వెంకటేశ్ టెన్షన్ పెడుతున్నారన్నమాట.

Similar News