భద్రాద్రి రాముడ్ని చూపాలంటే రూ.2లక్షలివ్వాలి.....?

Update: 2017-03-29 13:30 GMT

భద్రాద్రిలో జరిగే శ్రీరామనవమి వేడుకల్ని ప్రత్యక్ష ప్రసారం చేయడానికి ఎస్వీబీసీ ఛానల్‌ డబ్బులు డిమాండ్‌ చేయడం వివాదాస్పదమైంది. నిజానికి భద్రాద్రి వేడుకల్ని ప్రత్యక్షంగా చూడలేని భక్తులు టీవీలలో నవమి వేడుకల్ని., రాముల వారి కళ్యాణ ఉత్సవాలను చూసి తరిస్తుంటారు. అయితే ఈ ఏడాది శ్రీరామనవమి సందర్భంగా భద్రాచలం నుంచి వేడుకలను ప్రత్యక్ష ప్రసారం చేయడానికి రూ.2 లక్షలు చెల్లించాలంటూ శ్రీవేంకటేశ్వర భక్తి ఛానల్‌ లేఖ రాసింది. దీనిపై తితిదే ధర్మకర్తల మండలి సభ్యుడు, సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య అభ్యంతరం తెలిపారు. విషయాన్ని తితిదే ఈవో సాంబశివరావు దృష్టికి తీసుకెళ్లి సమస్యను పరిష్కరించాలని కోరారు. భద్రాచలం ఆలయ ఈవో తన దృష్టికి తీసుకువచ్చిన విషయాన్ని తితిదే ఈవోకు ఆయన వివరించారు. ఇది వరకు ఎన్నడూలేని విధంగా ఆధ్మాతిక కార్యక్రమాల ప్రసారానికి డబ్బులు అడగడం ఏమిటని సండ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ విషయమై ఈవో స్పందిస్తూ ఎలాంటి రుసుం వసూలు చేయకుండా ప్రసారాలు చేయాలని ఎస్వీబీసీ అధికారులను ఆదేశించారు. ఛానల్‌ ఏర్పడినప్పట్నుంచి నవమి వేడుకల్ని ఉచితంగానే ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నారు. రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో ఒంటిమిట్టతో పాటు భద్రాద్రి కళ్యాణాన్ని కూడా ఏకకాలంలో ప్రసారం చేశారు. తాజా లేఖ వెనుక కారణాలేమిటన్నది తెలియాల్సి ఉంది.

Similar News