బోసిపోయిన ఏటీఎంలు

Update: 2017-02-28 03:30 GMT

ఏటీఎంలు మళ్లీ బోసిపోయాయి. ఎక్కడ చూసినా నో క్యాష్ బోర్డులే దర్శనమిస్తున్నాయి. దీంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. ఏటీఎంలలో నగదు నింపక పోవడంతోనే ఈ సమస్య తలెత్తింది. వరుస సెలవులు రావడంతోనే ఏటీఎంలు ఖాళీ అయ్యాయని చెబుతున్నారు బ్యాంకు అధికారులు. శివరాత్రి నుంచి వరుస సెలవులు రావడంతో ఏటీఎంలలో క్యాష్ నింపలేదు. ఈ కారణంగా హైదరాబాద్ లోని 80 శాతం ఏటీఎంలలో క్యాష్ లేదు. మరోవైపు నగదు విత్ డ్రా పరిమితి కూడా ఎత్తి వేయడంతో ఉన్న ఏటీఎంలలో నగదు వెంటవెంటనే ఖాళీ అవుతోంది.

నేడు బ్యాంకుల బంద్

సోమవారం బ్యాంకులు పనిచేసినా బ్యాంకుల వద్ద కూడా డబ్బులేదనే సమాధానం రావడంతో అనేక బ్యాంకుల్లో ఖాతాదారులు ఘర్షణకు దిగారు. మంగళవారం జాతీయ బ్యాంకులు బంద్ కు పిలుపునిచ్చాయి. దీంతో ఈరోజు కూడా ఏటీఎం లు తెరుచుకునే అవకాశం లేదు. ఎస్బీఐలో బ్యాంకుల విలీనాన్ని వ్యతిరేకిస్తూ బంద్ నిర్వహించనున్నట్లు బ్యాంకు ఉద్యోగుల అసోసియేషన్ తెలిపింది. ఇప్పటికైనా ప్రభుత్వం చర్యలు తీసుకుని ఏటీఎంలలో క్యాష్ ఉండేలా చూడాలని ప్రజలు కోరుతున్నారు. నెల మొదటి వారం వస్తుండటంతో డబ్బు అవసరం చాలా ఉంటుందని, వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Similar News