బీజేపీకి బాబు షాకిస్తారా?

Update: 2016-12-21 04:37 GMT

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు తత్వం బోధపడిందా? నోట్ల రద్దు అంశం తన మెడకు చుట్టుకుంటుందని ఆందోళన చెందుతున్నారా? అందుకే బాబు టోన్ మారిందంటున్నారు విశ్లేషకులు. పెద్దనోట్ల రద్దయి నెలన్నర గడుస్తున్నా...పరిస్థితిలో ఏమాత్రం మార్పు లేదు. బ్యాంకుల వద్ద క్యూలైన్లు తరగడం లేదు. ఏటీఎంల వద్ద కు నగదు చేరడం లేదు. సామాన్యుల నుంచి మధ్యతరగతి ప్రజల వరకూ నోటు కోసం నిత్యం ఫీట్లు చేస్తూనే ఉన్నారు. ఇంకా ఎన్ని రోజులు ఈ తిప్పలన్నది సామాన్యులు ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఇంటలిజెన్స్ రిపోర్టు అందిందని చెబుతున్నారు. నోట్ల రద్దుపై ప్రజల్లో తీవ్రస్థాయిలో వ్యతిరేకత వ్యక్తమవుతుందన్నద ఆ రిపోర్టు సారాంశం. అందుకే బాబు తన టోన్ ను మార్చారు.

అంతా నావల్లే...ఇప్పడో...

పెద్ద నోట్లు రద్దయిన వెంటనే చంద్రబాబు తన వల్లే మోదీ ఆ నిర్ణయం తీసుకున్నారన్నారు. వెయ్యి నోటు రద్దు చేయమని ప్రధానికి తాను లేఖ రాసిన తర్వాతే ఈ నిర్ణయం వెలువడిందన్నారు. పెద్ద నోట్ల రద్దు వల్ల ఎన్నికల్లో అవినీతికి ఆస్కారముండదని కూడా చెప్పేశారు. ఈనిర్ణయాన్ని మనస్పూర్తిగా స్వాగతించారు. దీనికి తోడు కేంద్రం కూడా పెద్ద నోట్ల రద్దు ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రుల కమిటీకి చంద్రబాబును ఛైర్మన్ గా కూడా చేసింది. ఆర్బీఐ అధికారులు, నిపుణులతో అనేక సమావేశాల్లో చంద్రబాబు నోట్ల రద్దు విషయంపై చర్చించారు. అప్పటికాని బాబుకు పరిస్థితి అర్ధం కాలేదు. ఈ సమస్య ఇప్పట్లో తీరేది కాదని బాబుకు బోధపడింది.

ఇంటిలిజెన్స్ నివేదికతోనే....

పెద్ద నోట్ల రద్దుతో ఏపీలో సామాన్యులు అష్టకష్టాలు పడుతున్నారు. దినసరి కూలీలు, చిరు వ్యాపారుల బతుకులు రోడ్డుపై పడ్డాయి. మధ్యతరగతి ప్రజల్లో అసహనం పెరిగింది. తమ సొమ్మును తాము తీసుకోవడానికి ఇదేం నిర్ణయం?...ఇవేం షరతులు అన్న ప్రశ్నలు జనం నుంచి బాణాల్లా వస్తున్నాయి. పెన్షనర్లు క్యూల్లో నిలబడి ప్రాణాలు వదులుతున్నారు. ఇవన్నీ చంద్రబాబుకు ఇంటలిజెన్స్ ద్వారా అందిన సమాచారం. దీంతో బాబుకు ఏం చేయాలో అర్ధం కాలేదు. పరిస్థితి చక్కదిద్దడానికి అది తన చేతుల్లో లేదు. మరో మూడు నెలలు ఈ పరిస్థితిలో మార్పు రాదంటున్నారు బ్యాంకింగ్ రంగ నిపుణులు. ఈ నేపథ్యంలో బీజేపీకి తగిలే సెగ తనకూ తగులుతుందనుకుంటున్నారో ఏమో...బాబు ...టోన్ మార్చారు.. భవిష్యత్ లో మరేం నిర్ణయాలు తీసుకుంటారో ఏపీ ముఖ్యమంత్రి...చూడాలి మరి.

Similar News