బిజెపి స్పీడ్ పెంచింది ...!

Update: 2017-11-08 05:30 GMT

తెలంగాణాలో వచ్చే ఎన్నికల్లో అధికార పార్టీ తో ప్రధాన పోటీదారు కాంగ్రెస్ అని దాదాపు తేలిపోయింది. ఒంటరిగా పోటీ చేస్తామన్న బిజెపి, పూర్వవైభవం అన్న తెలుగుదేశం దిక్కుతోచని స్థితిలో పడ్డాయి. అటు అసెంబ్లీ లో ఇటు ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్ దూసుకుపోతుంది. భారీగా వలసలు టిఆర్ఎస్ లోకి, కాంగ్రెస్ లోకి సాగుతున్నాయి. ఇక చోద్యం చూస్తూ కూర్చుంటే మొదటికే మోసం వస్తుందని గ్రహించిన కమలనాధులు స్పీడ్ పెంచారు. ప్రజాఆందోళన కార్యక్రమాలు ఒక వైపు అసెంబ్లీలో అల్లరి మరోవైపు ఒకేసారి చేపట్టి జనం దృష్టిని ఆకర్షించే కార్యాచరణ మొదలు పెట్టింది బిజెపి.

బిజెపి ఆశలు చిగురిస్తాయా ...?

టిఆర్ ఎస్ కి ప్రత్యామ్నాయం తామే అని దూసుకుపోతున్న కాంగ్రెస్ ని ఢీ కొడుతుందా బిజెపి అంటే కష్టమనే విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. నోట్లరద్దు, జీఎస్టీ తో మోడీ క్రేజ్ తగ్గడం, నిన్న మొన్నటి వరకు టిఆర్ ఎస్ కేంద్రంలోని బిజెపితో సఖ్యతగా ఉండటం బిజెపికి మైనస్ గా మారాయి. ప్రస్తుత తరుణంలో కాంగ్రెస్, బిజెపి లను ప్రత్యర్ధులుగానే భావిస్తుంది టిఆర్ఎస్. ముఖ్యంగా కాంగ్రెస్ పైనే దృష్టి పెట్టి ఇప్పుడు ఆ పార్టీ నుంచి పెద్ద ఎత్తున వలసలు వచ్చేలా ఆపరేషన్ ఆకర్ష్ మొదలు పెట్టింది. ఈ నేపథ్యంలో బిజెపి ప్రజా సమస్యలపై తాము పోరుబాటలోనే ఉంటామని చాటి చెప్పే ప్రయత్నాలు ముమ్మరం చేయడం విశేషం. వారి ప్రయత్నాలు ఏమేరకు ఫలిస్తాయో వేచి చూడాలి.

Similar News