బాబూ మీ నేతల మాట విన్పించలేదా?

Update: 2017-11-07 01:30 GMT

చంద్రబాబు నాయుడిని వ్యక్తిగతంగా విమర్శించకూడదట. ఆయనే స్వయంగా ఈ విషయాన్నిచెప్పారు. ఇడుపులపాయలో జరిగిన బహిరంగ సభలో జగన్ చంద్రబాబు పాలనపై ధ్వజమెత్తిన సంగతి తెలిసిందే. అయితే దీనికి చంద్రబాబు స్పందిస్తూ వ్యక్తిగతంగా తిట్టడం తెలుగువారి సంస్కారం కాదన్నారు. ఇడుపులపాయలో తెలుగుదేశం ప్రభుత్వం చేసిన అభివృద్ధి కన్పించలేదా? అని ప్రశ్నించారు. అసెంబ్లీలో సమస్యలపై చర్చించాలి కాని, సమావేశాలను బహిష్కరించడం ఏమిటన్నారు. అసెంబ్లీలో సభ్యులు హుందాతనంగా నడుచుకోవాలన్నారు. చంద్రబాబు అవినీతి సొమ్ముతో తమ పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేశారన్న జగన్ వ్యాఖ్యలపై చంద్రబాబు స్పందించారు.

జగన్ ను తిట్టినప్పుడు గుర్తుకు రాలేదా?

అయితే వ్యక్తిగత దూషణలకు దిగడం సరికాదన్న చంద్రబాబు వ్యాఖ్యలు ఒకసారి తన పార్టీకి చెందిన మంత్రులు, నేతలు జగన్ పై వ్యక్తిగతంగా ఎలా విమర్శలకు దిగుతున్నారో తెలియడంలేదా? అని నెటిజెన్లు ప్రశ్నిస్తున్నారు. జగన్ అవినీతి పరుడని, విధ్వంసకారుడని, ఫ్యాక్షనిస్టు అని టీడీపీ నేతల వ్యాఖ్యలు చంద్రబాబుకు విన్పించలేదా? అని సోషల్ మీడియాలో నెటిజెన్లు అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. రాజకీయాల్లో వ్యక్తిగత విమర్శలు సహజమని, దానికి వివరణ ఇవ్వాల్సిందే తప్ప ఎదురుదాడికి దిగడమేంటని మరికొందరు నిలదీస్తున్నారు. అసెంబ్లీని బహిష్కరించడం సరికాదన్న చంద్రబాబు అసెంబ్లీలో వైసీపీ ఎమ్మెల్యేలకు ఎలా మంత్రిపదవులు ఇచ్చారని కూడా కొందరు సెటైర్లు వేస్తున్నారు. మొత్తం మీద సోషల్ మీడియాలో రెండు పార్టీల మధ్య వార్ పీక్ స్టేజ్ కు చేరుకుంది.

Similar News