బాబు యూటర్న్ పై బీజేపీ ఫైర్

Update: 2018-02-23 06:30 GMT

మాటమార్చిన టీడీపీ అధినేత చంద్రబాబుపై బీజేపీ విరుచుకు పడింది. మొన్నటి వరకూ ప్రత్యేక ప్యాకేజీకి సిద్ధమని చెప్పిన చంద్రబాబు ఇప్పుడు ప్రత్యేక హోదా కావాలని డిమాండ్ చేయడం పట్ల బీజేపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని కేంద్రం ప్రకటించిన తర్వాత చంద్రబాబు ఏమేం మాట్లాడారో ఒకసారి రివైండ్ చేసుకోవాలని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు అన్నారు. ప్రత్యేక ప్యాకేజీ అద్భుతమని చంద్రబాబు అన్నది నిజం కాదా? అని సోము వీర్రాజు ప్రశ్నించారు. నాలుగేళ్లు గడిచిన తర్వాత కేంద్రం ఏమిచ్చిందని అడగటం విడ్డూరంగా ఉందన్నారు.

ఆనాడు సీఎం అనలేదా?

ఏపీ అభివృద్ధి బీజేపీ లక్ష్యమని సోము వీర్రాజు తెలిపారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి బీజేపీ కట్టుబడి ఉందని, దానికి నిధులు మొత్తం కేంద్రమే భరిస్తుందని, అయినా చంద్రబాబు పోలవరానికి 2019 డెడ్ లైన్ అంటూ తమకు టార్గెట్ పెట్టడమేంటని సోము వీర్రాజు ప్రశ్నించారు. ప్రత్యేక హోదాతో ఒరిగేదేమీ లేదన్నారు. బీజేపీ వల్లనే ముంపు మండాలాలన్నీ ఏపీలో కలిశాయన్నారు. ఈ విషయంలో లగడపాటి రాజగోపాల్, ఉండవల్లి అరుణ్ కుమార్ లకు ఛాలెంజ్ చేస్తున్నానన్నారు. వారు ముంపు మండలాలపై ఆరోజు ఎందుకు మాట్లాడలేదన్నారు.

చంద్రబాబును నిలదీయండి.....

గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పిన మాటలనే తాను చెబుతున్నానన్నారు. హోదాతో వచ్చేవి మూడు కోట్లేనని సీఎం చంద్రబాబు చెప్పింది నిజం కాదా? అని సోము నిలదీశారు. ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాల్లో అభివృద్ధి ఏమీ జరగలేదని నాడు సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను సోము వీర్రాజు ఈ సందర్భంగా గుర్తు చేశారు. బీజేపీ నేతల్ని కాదు మాట మార్చిన చంద్రబాబును ముందు అందరూ నిలదీయాలని సోము వీర్రాజు పేర్కొన్నారు. ప్రెస్ మీట్ కు పిలిచి మరీ చంద్రబాబును అడగమని మీడియా ప్రతినిధులకు సలహా ఇచ్చారు. హోదా అంటే జైలుకే అని ఆరోజు చంద్రబాబు అన్న మాటను సోము మరోసారి గుర్తు చేశారు. అన్ని రాష్ట్రాల కంటే మనమే ఎక్కువ సాధించామని చెప్పిన చంద్రబాబు ఇప్పుడు యూటర్న్ ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందన్నారు. రాష్ట్రాన్ని విభజించాలంటూ ఆరోజు చంద్రబాబు రాష్ట్రపతికి లేఖ ఇచ్చారని, ఇక్కడికి వచ్చి అన్యాయం అంటూ...సమన్యాయం అంటూ వ్యాఖ్యలు చేసింది ప్రజలు మర్చిపోలేదన్నారు. విజయవాడలో జరిగిన మీట్ ది ప్రెస్ లో సోము చంద్రబాబుపై మరోసారి మాటల దాడి చేశారు.

Similar News