బాబు మాటలే బాధితులకు సాంత్వన వచనాలు

Update: 2016-09-25 06:20 GMT

ఈ విషయంలో చంద్రబాబునాయుడు ఒక రకంగా తన అనుభవాన్ని వెలికి తీశారు. భారీ వర్షాల కారణంగా జనజీవితం దారుణం గా దెబ్బతిన్నప్పుడు.. ఏపీ ప్రభుత్వం స్పందిస్తున్న తీరు కాస్త ప్రశంసార్హంగా ఉంది. ఒకవైపు కేసీఆర్.. నగరంలో వర్షాల వల్ల ఇబ్బందులను మీడియా ఎక్కువ చేసి చూపిస్తున్నదంటూ.. మీడియా వారి మీద కారాలు మిరియాలు నూరారు. రోడ్లన్నీ చక్కగా ఉన్నాయని తమకు తామే కితాబు ఇచ్చుకున్నారు. అధికార్లంతా చక్కగా చేస్తున్నారని చెప్పుకొచ్చారు. కేంద్రాన్ని సాయం అడగడానికి 300 కోట్లతో రోడ్లు వేయిస్తాం.. అంటూ పెద్ద హామీలే ఇచ్చారు.

అయితే అదే ఆంధ్రప్రదేశ్ లో కార్యరూపం మొదలైపోయింది. రెండు మూడు రోజుల్లోగా ఆర్ అండ్ బీ రోడ్లకు ఏర్పడిన రిపేర్లు మొత్తం పూర్తి కావాల్సిందేనంటూ చంద్రబాబునాయుడు హుకుం జారీ చేయడం విశేషం. అలాగే చెరువులు గండ్లు కూడా మూడు రోజుల్లో పూడ్చేయాలంటూ పురమాయించారు. వరద సహాయాలకు, పునర్నిర్మాణ పనులకు సంబంధించి ప్రతి పనికీ నిర్దిష్టమైన డెడ్ లైన్ ను పెట్టి అధికారులతో పని చేయించేలా చంద్రబాబు ఒక ప్రణాళిక బద్ధంగా వెళుతున్నట్లు కనిపిస్తోంది. వరదల వల్ల నష్టపోయిన ప్రజలకు కూడా తక్షణ చేయూత అందాలంటూ చంద్రబాబు పురమాయించారు. బాధితులకు సాయం అందడంలో జాప్యం జరిగినట్లు తెలిస్తే చర్యలు అధికార్ల మీదనే ఉంటాయంటూ హెచ్చరించడం విశేషం.

నిజానికి ప్రక్రుతివిపత్తుల వల్ల ఏర్పడే ఇబ్బందులుగా వీటిని పరిగణించి, ఇది తమ వైఫల్యం కాదు లెమ్మనుకుని, నష్టనివారణ చర్యల్లో లోపాలున్నాయని తెలంగాణ సర్కారు కూడా ఒప్పుకుంటే.. ఇక్కడ కూడా సహాయక చర్యలు వేగం పుంజుకుంటాయి. వాటి వల్ల ప్రయోజనం ఉంటుంది. అయితే.. ఇక్కడ ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలకు ప్రజలే బాధ్యులు అన్నట్లుగా చిత్రిస్తుండడం వల్ల పరిస్థితి తేడా కొడుతోంది.

Similar News