బంగారంలో ‘‘నల్ల బంగారం’’ వేరయా?

Update: 2016-12-04 09:00 GMT

నల్లధనం అంతు తేలుస్తాం అంటూ ప్రజలు నానాపాట్లు పడుతుండడానికి మోదీ సర్కారు పరోక్షంగా కారణమైంది. పైగా.. ప్రజలు చిరునవ్వుతో ఈ కష్టాలు పడుతున్నారంటూ భాజపా నాయకులు దొరికిన ప్రతి బహిరంగ వేదిక మీద కల్లబొల్లి కబుర్లు చెబుతూ.. ఆత్మవంచన చేసుకుంటున్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే.. తాజాగా బంగారం విషయంలో ఆంక్షల గురించి రాద్ధాంతం జరుగుతోంది. ‘ మా పుస్తెల తాళ్లు కూడా తెంపుకు పోతారా’ అంటూ మహిళలు అసలు ఆంక్షలేమిటో అర్థం కాక గందరగోళంలో, ఆందోళనకు గురయ్యే పరిస్థితి కనిపిస్తోంది. అయితే మహిళల్లో ఆగ్రహజ్వాలల్ని తగ్గించడానికి భాజపా నాయకులంతా ప్రతిచోటా బంగారం నిబంధనల గురించి చెప్పడానికి, తమను తాము సమర్థించుకోడానికి ప్రయత్నిస్తున్నారు. ‘మీ బంగారం జోలికి ఎవ్వరూ రారు. నవంబరు 8వ తేదీ తర్వాత నల్లడబ్బు తీసుకువెళ్లి.. కిలోల్లో బంగారం కొన్నవారి మీదనే దృష్టి పెడుతున్నాం. వారి మీదనే చర్యలుంటాయి’ అని చెబుతున్నారు. కానీ నల్లడబ్బుతో నల్లబంగారం కొన్నవారి సంగతి ఎవరికి చిక్కుతుంది...? ఇది బహుశా వెంకయ్యనాయుడు కూడా చెప్పలేరేమో.

విషయం ఏంటంటే.. 8వ తేదీ తర్వాత పెద్దమొత్తాల్లో బంగారం కొన్నవారి ఆనుపానులు తెలుసుకోవడానికి విక్రయించిన దుకాణాల మీద ఆధారపడడం తప్ప ప్రభుత్వానికి వేరే మార్గం లేదు. మామూలుగానే బంగారం దుకాణాల్లో 50వేలకు మించి జరిగే క్రయవిక్రయాల్లో పాన్ కార్డు నమోదు ఉండాలనే నిబంధన ఉంది. దాని ప్రకారం కొన్న వారి వివరాలు పట్టుకుంటున్నారు. అయితే కాస్త లోతుగా గమనిస్తే.. నల్లడబ్బు లాగానే , బంగారం వ్యాపారుల వద్ద లెక్కల్లో లేని నల్ల బంగారం కూడా ఉంటుంది. ప్రతి వ్యాపారి వద్దా అది చాలా పెద్ద మోతాదుల్లోనే ఉంటుంది. ఈ నల్లడబ్బుకు ఆ నల్లబంగారాన్ని ఎక్కడా ఎలాంటి లెక్కల్లోనూ చూపించకుండా వారు విక్రయించి సొమ్ము చేసుకుని ఉంటే దాని సంగతేమిటి. అలాంటి అతి తెలివి నల్లకుబేరుల్ని ఈ సర్కారు పట్టుకోవడం సాధ్యమయ్యేలా లేదు సరికదా.. అలాంటి నల్ల మరియు పాత బంగారం అంతా అనువంశికంగా వస్తున్నదని కొన్నవారు తప్పించుకోవడమూ సాధ్యమే. ఎటూ అది రసీదుల్లో కనిపించదు గనుక.

అలాగే నల్ల కుబేరులు చాలా మంది దుకాణాలతో సంబంధం లేకుండా.. మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి వ్యక్తులనుంచి ఎక్కువ ధర చెల్లించి వారి బంగారు ఆభరణాలను కొనేశారు. మార్కెట్ లో బంగారం ధరకంటె దాదాపు 30-40 శాతం ఎక్కువ వస్తోంటే.. జనం కూడా ఎగబడి నల్లకుబేరులకు తమ నగలు అమ్ముకున్నారు. అవన్నీ కూడా.. ఎలాంటి రసీదులు లేని.. నల్లబంగారంగానే.. నల్లకుబేరుల ఇనప్పెట్టెల్లోకి వెళ్లిపోయాయి. ఇప్పుడు అవన్నీ కూడా వారు అనువంశికంగా వచ్చినవిగా క్లెయిం చేసుకుంటారు. ప్రభుత్వం ఏమీ చేయలేని పరిస్థితిలో పడుతుంది.

ఏతావతా తేలుతున్నదేంటంటే... ప్రభుత్వం నల్లధనం కట్టడి చేయాలనుకుంటే.. కోట్లకు కోట్లు రాత్రికి రాత్రి మార్చేసిన నల్లకుబేరులు సేఫ్ గానే ఉండగా సామాన్యుడి బతుకు కుక్కలు చింపిన విస్తరి లాగా రోడ్డున పడింది. బంగారం విషయంలో అక్రమాలను ఏరేస్తాం అని సర్కారు అంటోంటే.. కుబేరులంతా సైలెంట్ గా ఉండగా.. సామాన్యులు తమ పుస్తెలు తెంపుకుపోతారేమో అన్నట్లుగా మీడియా ముందు ఆక్రోశిస్తూ గడిపేస్తున్నారు.. అదీ సంగతి!!

Similar News