ప్రభుత్వ లెక్కలన్నీ వాస్తవ దూరం

Update: 2016-12-29 09:05 GMT

నూతన రాష్ట్రమైన ఆంద్ర ప్రదేశ్ అన్ని ఆర్ధిక అడ్డంకులు దాటుకుని అభివృద్ధి పథం వైపు అడుగులు వేస్తుంది అని, 12.23 శాతం వృద్ధి రేటు ఇప్పటికే సాధించామని ఆంద్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్య మంత్రి నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర ఆర్ధిక మంత్రి యనమల రామ కృష్ణుడు ప్రజలను తప్పు ద్రోవ పట్టిస్తున్నారని వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బొత్స సత్యనారాయణ ఆంద్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ధోరణి పై మండిపడ్డారు. ఆర్ధిక శాఖ ప్రకటిస్తున్న అభివృద్ధి వాస్తవ దూరం అని సోషియో ఎకనామిక్ సర్వే ఫలితాలు నిరూపిస్తున్నాయని తెలియజేసారు. ఎవరిని మభ్యపెట్టడానికి ప్రభుత్వం తప్పుడు లెక్కలను ప్రచారం చేస్తుందో అర్ధం కావటం లేదని, నిజంగా ప్రభుత్వానికి చిత్త శుద్ధి ఉంటే ఆర్ధిక శాఖ సంబింధించిన ఏ ఒక్క ప్రభుత్వ ప్రతినిధినైనా పూర్తి వివరాలతో బహిరంగ చర్చకు పంపాలని సవాల్ విసిరారు బొత్స.

నిజంగా వృద్ధి జరిగి ఉంటే ఆ ఫలితం రాయాష్ట్ర రెవిన్యూ లో కనిపించేదని, గత ఏడాది తో పోలిస్తే మరి ఆ రెవిన్యూ ఎందుకు తగ్గిందని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు బొత్స సత్యనారాయణ. "నారా చంద్రబాబు నాయుడు ప్రతిపక్షంలో వున్న రోజులలో అనవసరమైన వాదనలతో నాటి ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఒంటెత్తు పోకడ వ్యవహరించేవారు. కానీ నేడు ప్రతిపక్షం సరైన లెక్కలను ప్రవేశ పెట్టి, ప్రభుత్వం ప్రకటించిన అసత్యపు ఆర్ధిక వృద్ధి లెక్కలను నిలదీసే ప్రయత్నం చేస్తుంటే ఆయన ఎదుర్కొనే ధైర్యం లేక ప్రతిపక్షాల గొంతు నొక్కేసే ప్రయత్నాలు చేస్తున్నారు. శాసన సభలో ప్రతిపక్షం లేకుండా చేసుకోవాలనే చంద్ర బాబు దుర్బుద్ధిని ప్రజలు గమనిస్తున్నారు. మీ ఆధిపత్యం ప్రదర్శించటానికా మీరు ప్రభుత్వం నడుపుతున్నది? పైగా పోలవరం ప్రాజెక్ట్ ను గతంలో వ్యతిరేకించిన ఇదే చంద్రబాబు నేడు పోలవరం ఘనత తన ఖాతాలో వేసుకుంటూ నైతిక విలువలను కోల్పోయారు." అంటూ ముఖ్య మంత్రిపై ధ్వజమెత్తారు బొత్స సత్యనారాయణ.

Similar News