ప్రపంచబ్యాంకు నిధులతో అమరావతి కి శ్రీకారం

Update: 2016-11-18 07:55 GMT

2018 నాటికి ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నగరం తొలివిడత పనులు పూర్తయ్యే అవకాశం కనిపిస్తోంది. సీఆర్డీఏ కమిషనర్ చెబుతున్న వివరాలు, నిపుణుల అంచనాలను పోల్చి చూసుకున్నా సరే.. 2018 సంవత్సరాంతానికి మౌలిక వసతుల కల్పన విషయంలో ఒక నిర్దిష్టమైన రూపం వస్తుందని, కోర్ కేపిటల్ మరియు కొన్ని భవనాల నిర్మాణాలు పలుదశల్లో ఉండే అవకాశం ఉన్నదని అనుకుంటున్నారు. కోర్ కేపిటల్ భవనాలకు మాత్రం కేంద్రం పూర్తి ఖర్చు భరించే హామీ అలాగే ఉంది. మౌలిక వసతుల విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఆందోళన చెందుతూ ఉండగా.. ప్రపంచ బ్యాంకు అందించబోతున్న ఆర్థిక సహాయంతో పనులకు శ్రీకారం జరిగే అవకాశం కనిపిస్తోంది.

అమరావతి నగర నిర్మాణ పనుల విషయంలో పురోగతి ఎలా ఉన్నదనే విషయంలో పలు కీలక అంశాలను సీఆర్డీఏ కమిషనర్ శ్రీధర్ శుక్రవారం నాడు మీడియాకు వివరించారు. 2018 నాటికి తొలిదశ అమరావతి నగరం పూర్తవుతుందని ఆయన అంటున్నారు. అమరావతి నిర్మాణంపై సీఎం చంద్రబాబుతో సమీక్ష సమావేశం జరిగిన రెండోరోజున మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించడం విశేషం. శ్రీధర్ వెల్లడించిన వివరాల ప్రకారం...

- అమరావతి నగరం తొలిదశ నిర్మాణాలు పూర్తి కావడానికి 20 వేల కోట్ల రూపాయల వ్యయం అవుతుంది.

- అమరావతి నిర్మాణానికి ప్రపంచబ్యాంకు ఒక బిలియన్ డాలర్లు అప్పుగా ఇవ్వడానికి అంగీకరించింది. ఇందులో 500 మిలియన్ డాలర్లు త్వరలోనే విడుదల కాబోతున్నాయి.

- హడ్కో 7500 కోట్ల రూపాయల రుణాన్ని సమకూర్చడానికి అంగీకరించింది.

- యూకే కూడా 6 బిలియన్ డాలర్లు రుణం ఇవ్వడానికి సమ్మతించింది.

- ఆంధ్రా బ్యాంకు 500 కోట్లు ఇవ్వడానికి అంగీకరించింది.

కోర్ కేపిటల్ నిర్మాణాలకు కేంద్రమే పూర్తి నిధులు భరించాల్సి ఉంది. అయితే డీపీఆర్ లు పూర్తయిన తర్వాత నిధులు విడుదల చేస్తాం అని చెబుతున్నారు. ఈలోగా మౌలిక వసతుల కల్పన అనేది చాలా పెద్ద ఖర్చుతో కూడుకున్న విషయం. ఈ పనులు బహుశా ప్రపంచ బ్యాంకు త్వరలో విడుదల చేస్తుందని ఆశిస్తున్న 500 మిలియన్ డాలర్ల రుణంతోనే మొదలయ్యే అవకాశం కనిపిస్తోంది.

శ్రీధర్ మాట్లాడుతూ... నిబంధనలకు వ్యతిరేకంగా సీఆర్డీఏ వ్యవహరించదు అని, రాజధాని పరిధిలో మధ్యలో వచ్చే గ్రామాలను ఎక్కడకూ తరలించడం ఉండదు అని హామీ ఇచ్చారు. ఇప్పటికే 32 వేల ఎకరాలను రాజధాని కోసం సేకరించాం అన్న ఆయన, ఇంకా 1400 ఎకరాలు సేకరించాల్సి ఉందని కూడా చెప్పారు.

Similar News