పోలీసుల తీరుపై సిఎం అసహనం.....

Update: 2017-02-12 14:44 GMT

జాతీయ మహిళా పార్లమెంటు సదస్సుకు వచ్చిన వైఎస్సార్‌సీపీ మహిళా అధ్యక్షురాలు., నగరి ఎమ్మెల్యే రోజా విషయంలో పోలీసులు వ్యవహరించిన తీరుపై ముఖ్యమంత్రి తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. సమస్యను పరిష్కరించడంలో పోలీసులు అత్యుత్సాహం చూపారనే విమర్శలు రావడంతో ముఖ్యమంత్రి విజయవాడ పోలీస్ కమిషనర్ గౌతమ్‌ సవాంగ్‌తో పాటు., ఇంటెలిజెన్స్‌ చీఫ్‌లను తప్పు పట్టినట్టు తెలుస్తోంది. శనివారం మహిళా పార్లమెంటు సదస్సులో పాల్గొనేందుకు హైదరాబాద్‌ నుంచి వచ్చిన రోజాను విమానాశ్రయ లాబీలోనే గంటపాటు నిలిపివేశారు. ఆమెకు సరైన సమాచారం ఇవ్వకుండా అనవసరపు హైడ్రామా సృష్టించినట్లు ముఖ్యమంత్రికి నిఘా వర్గాలు సమాచారమిచ్చాయి.

ఎయిర్‌పోర్టులో రోజాను నిర్బంధించడంతో మీడియా ఫోకస్‌ మొత్తం అటువైపే వెళ్లిపోయింది. శనివారం మొత్తం మహిళా పార్లమెంటు సదస్సు కంటే రోజా తరలింపు వ్యవహారమే హైలెట్ అయ్యింది. మహిళ పార్లమెంటు సదస్సులో రోజా రాద్ధాంతం సృష్టిస్తుందనే అనుమానంతో పోలీసులు ఆమెను ఎయిర్‌పోర్టులోనే అడ్డుకున్నారు. నిజానికి రోజా సదస్సులో ఆహ్వానితురాలిగా పాల్గొంటుందే తప్ప ఆమెకు మాట్లాడే అవకావశం లేదు. సోషల్ మీడియాలో ఆమె చేసిన వ్యాఖ్యలను దృష్టిలో పెట్టుకుని పోలీసులు అతి జాగ్రత్తగా తీసుకోవడం వికటించింది. విజయవాడ సెంట్రల్ ఏసీపీ శ్రావణి., సిఐ సాహేరాబేగం., మరో ఏసీపీ రాజీవ్ కుమార్‌లను చూసి రమ్మంటే మొత్తం రచ్చ చేసేశారు. రోజాను విజయవాడ నుంచి తరలిస్తే అది మహిళా సదస్సు దృష్టి మళ్లించే అంశం అవుతుందనే చిన్న లాజిక్‌ కూడా బెజవాడ పోలీసులు క్యాచ్‌ చేయలేకపోయారు. ఈ విషయంలో రోజానే పైచేయి సాధించడంతో ముఖ్యమంత్రి పోలీసుల తీరును తప్పు పట్టినట్లు తెలుస్తోంది.

మహిళా పార్లమెంటేరియన్‌ సదస్సులో పాల్గొని అక్కడ ఆమె ఏదైనా రాజకీయ విమర్శలకు దిగి ఉంటే అది వైసీపీని ఇరకాటంలోకి నెట్టి ఉండేది. దేశవిదేశాల నుంచి వేల మంది ఆహ్వానితులు వచ్చిన సదస్సులో మహిళా సాధికారతపై చర్చిస్తున్న వేళ రోజా కూడా అంతటి సాహసానికి దిగి ఉండేది కాదు. కేవలం ముఖ్యమంత్రి., ప్రభుత్వ తీరును విమర్శిస్తూ చేసిన వ్యాఖ్యల ఆధారంగా ఆమె మహిళా పార్లమెంటు సదస్సులో రచ్చ చేస్తుందనే తప్పుడు అంచనాలు ప్రభుత్వ పరువు తీశాయి. దీనంతటికి కొందరు అధికారుల అనాలోచిత నిర్ణయాలే కారణమని తెలియడంతో ముఖ్యమంత్రి ., ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చేలా వ్యవహరించొద్దని గట్టిగా సూచించినట్లు సమాచారం.

Similar News