పోలవరం నిర్మాణమే ఒక చరిత్ర

Update: 2016-12-13 13:36 GMT

పోలవరం నిర్మాణమే చరిత్రపుటల్లో పదిలంగా ఉండాల్సిన ఒక అధ్యాయం అని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు భావిస్తున్నారు. పనులు జరుగుతున్న తీరు మొత్తం ప్రతి దశలోనూ వీడియోలు తీయించి... సమగ్రమైన డాక్యుమెంటరీగా దానిని పదిలపర్చాలని ఆయన అభిలషిస్తున్నారు. పనులు సమీక్షించిన ముఖ్యమంత్రి వేగిరం పూర్తిచేయాల్సిన అవసరం గురించి, లక్ష్యాన్ని అందుకోవాల్సిన బాధ్యత గురించి అధికారుల్ని హెచ్చరిస్తున్నారు.

పోలవరం ప్రాజెక్టు నిర్మాణం అనుకున్న సమయంలోగా సాకారం కావాలంటే నిర్దేశిత లక్ష్యాన్ని ఎప్పటికప్పుడు పూర్తి చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. సమయం తక్కువగా వున్నందున పెండింగ్ పనులను త్వరితగతిన చేపట్టాలని అధికారులు, నిర్మాణ సంస్థల ప్రతినిధులను ఆదేశించారు. ఈవారం నిర్దేశించుకున్న మొత్తం తవ్వకం పనులలో 5.87 లక్షల క్యూబిక్ మీటర్ల మేర వెనుకబడి వుండటంపై ముఖ్యమంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు.

మంగళవారం సచివాలయంలోని తన కార్యాలయంలో పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం పనులపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. ప్రాజెక్టు పనులు సాగుతున్న తీరును వర్చువల్ ఇన్‌స్పెక్షన్ ద్వారా పరిశీలించారు. పోలవరం నిర్మాణ ప్రాంతం నుంచి ప్రాజెక్ట్ చీఫ్ ఇంజినీర్ రమేష్‌కుమార్ పనుల పురోగతిని ప్రత్యక్ష ప్రసారంలో ముఖ్యమంత్రికి తెలిపారు.

గడిచిన వారంలో స్పిల్‌వే, స్పిల్ చానల్, పవర్ హౌస్ ఫౌండేషన్, అప్రోచ్ చానల్, పైలెట్ చానల్ అన్నీ కలిపి 13.87 లక్షల క్యూబిక్ మీటర్ల మేర తవ్వకం పనులు సాగాయని అధికారులు పేర్కొన్నారు. గతవారంలో మొత్తం 2.56 లక్షల క్యూబిక్ మీటర్ల స్పిల్‌వే, 7.66 లక్షల క్యూబిక్ మీటర్ల స్పిల్ చానల్, 2.27లక్షల క్యూబిక్ మీటర్ల పవర్ హౌస్ ఫౌండేషన్, 76 వేల క్యూబిక్ మీటర్ల అప్రోచ్ చానల్, 62 వేల క్యూబిక్ మీటర్ల వరకు పైలెట్ చానల్ తవ్వకం పనులు జరిగాయని అన్నారు.

రోజుకు సగటున 37 వేల క్యూబిక్ మీటర్ల చొప్పున స్పిల్‌వే, 1.09 లక్షల క్యూబిక్ మీటర్ల వరకు స్పిల్ చానల్, 32 వేల క్యూబిక్ మీటర్ల మేర పవర్‌హౌస్ ఫౌండేషన్ తవ్వకం పనులు చేపట్టామని నిర్మాణ సంస్థల ప్రతినిధులు చెప్పారు. మరో రెండు నెలల్లోగా స్పిల్‌వే, ఆరు నెలల్లో స్పిల్ చానల్ పనులు పూర్తి చేయాలని అధికారులకు, త్రివేణి సంస్థల ప్రతినిధులకు ముఖ్యమంత్రి నిర్దేశించారు. జనవరి 7 నుంచి డయాఫ్రమ్ వాల్ పనులు ప్రారంభించాలని చెప్పారు. కాంక్రీట్ పనులకు సంబంధించి అవసరమయ్యే యంత్రపరికరాలను నిర్మాణ ప్రాంతంలో అందుబాటులో వుంచామని, ఐరన్, సిమెంట్ వంటి ఇతర మెటీరియల్ తరలింపు ప్రస్తుతం కొనసాగుతోందని అధికారులు చెప్పారు. కాంక్రీట్ పనులు ప్రారంభించడానికి చేయాల్సిన అన్ని పరీక్షలను పూర్తి చేసినట్టు తెలిపారు. 960 మెగావాట్ల సామర్ధ్యం కలిగిన హైడ్రో ఎలక్టిక్ ప్రాజెక్ట్ నిర్మాణానికి వచ్చేవారం టెండర్లు పిలవనున్నట్లు ఏపీజెన్‌కో అధికారులు ముఖ్యమంత్రికి వెల్లడించారు.

‘పోలవరం’ చరిత్ర పదిలం

పోలవరం ప్రాజెక్టు నిర్మాణం చరిత్రలో నిలిచిపోయేలా ప్రతిదశలో పనులను చిత్రీకరించి డాక్యుమెంటరీ రూపంలో భద్రపరచాలని ముఖ్యమంత్రి సూచించారు. పోలవరం నిర్మాణం గురించి భవిష్యత్ తరాలు తెలుసుకోవాల్సిన అవసరం వుందని, ఇందుకోసం ఎగ్జిబిషన్-మ్యూజియం ఏర్పాటుకు ఇప్పటి నుంచే చర్యలు చేపట్టాలన్నారు. అవసరమైతే నేషనల్ జియోగ్రఫిక్, డిస్కవరీ వంటి చానళ్ల సహకారం తీసుకోవాలని చెప్పారు. వచ్చేవారం దీనిపై స్పష్టతతో రావాలని ముఖ్యమంత్రి అన్నారు.

Similar News