పెడన ఓటమిపై చినబాబు సీరియస్

Update: 2016-09-29 11:20 GMT

క్రిష్ణా జిల్లాలోని పెడన మునిసిపాలిటీ ఛైర్మన్ స్థానాన్ని గెలుచుకోవడం లో ఎదురైన వైఫల్యంపై తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చాలా సీరియస్ గా ఉన్నట్లుగా తెలుస్తోంది. పెడన మునిసిపాలిటీ ఛైర్మన్ పదవిని వైకాపా గెలుచుకున్నట్లుగా తెలిసిన వెంటనే ఆయన దాన్ని జీర్ణం చేసుకోలేకపోయారని.. చెబుతున్నారు. బలాలు సమానంగా ఉన్నప్పటికీ ఎక్స్ అఫీషియో సభ్యుడు ఎమ్మెల్యే తమవాడే గనుక గెలుపు తథ్యం అని అంతా అనుకున్నారు. అయితే పార్టీ కౌన్సిలర్ హ్యాండ్ ఇవ్వడంతో అంతా తారుమారు అయింది.

క్రిష్ణా జిల్లా పెడన మునిసిపాలిటీలో 22 వార్డులుండగా, తెలుగుదేశం, వైకాపాలు చెరి 11 స్థానాలు గెలుచుకున్నాయి. తెదేపాకు ఎంఎల్ ఏ బలం కూడా ఉన్నది కనుక గెలుపు తథ్యం అని అంతా అనుకున్నారు. కానీ పోలింగ్ జరిగిన సమయంలో తెదేపా కౌన్సిలర్ స్రవంతి వైకాపా అభ్యర్థికి మద్దతు తెలియజేసింది. దీంతో ఫలితం తారుమారు అయింది.

స్థానికంగా ఎమ్మెల్యేకు మంత్రికి ఉన్న విభేదాల పర్యవసానంగానే.. పెడన లో ఓటమి అని పార్టీ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. అయితే చేజేతులా ఓ మునిసిపల్ చైర్మన్ స్థానాన్ని పోగొట్టుకోవడాన్ని లోకేష్ జీర్ణం చేసుకోలేకపోతున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంలో ఆయన మంత్రి, ఎమ్మెల్యే ఇద్దరినీ పిలిపించి క్లాస్ పీకనున్నట్లుగా పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.

Similar News